'జగన్ ఓటు తొలగించాలి' - data theft
రాష్ట్రంలో అక్రమంగా లక్షలాది ఓట్లు తొలగించడానికి వైకాపా కుట్ర పన్ని.. ఏదో గొప్ప పని చేసినట్లు జగన్ తానే చేశామని చెప్పుకుంటున్నారని మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంతో సంబంధం లేకుండా హైదరాబాద్ నుంచే అన్ని వ్యవహారాలు నడిపిస్తున్న జగన్ ఓటును ఫారం-7 ద్వారా తొలగించాలన్నారు. అక్రమ మార్గాల ద్వారా కాకుండా దమ్ముంటే పోటీ చేసి గెలవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 18 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన గురుకుల పాఠశాల భవనంపాలిటెక్నిక్ కళాశాల అదనపు గదులను మంత్రి సోమిరెడ్డి ప్రారంభించారు. అనంతరం మీడియాతో ముచ్చటిస్తూ.. జగన్‌పై విరుచుకుపడ్డారు. నకిలీ ఓట్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం ఇచ్చిన సదవకాశాన్ని వైకాపా దుర్వినియోగపరుస్తుందని ఆరోపించారు. ఒక్క విశాఖ జిల్లాలోనే 75 వేల ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులు చేశారని మండిపడ్డారు. 'జగన్ ఉండేది హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో, పార్టీ కార్యక్రమాలు, వేడుకలు జరుపుకునేది తెలంగాణలో, కేసులు పెట్టేది అక్కడే. ఇలా అన్ని వ్యవహారాలను పక్కరాష్ట్రం నుంచి చేస్తున్న జగన్‌కు ఆంధ్రాలో ఓటు ఎందుకు' అని మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు. ఫారం-7 ద్వారా వైకాపా అధినేత ఓటును మొదట తొలగించాలన్నారు. ఐటీ గ్రిడ్‌లో అక్రమంగా ప్రజల సమాచారాన్ని దాచలేదని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన 5 వేల కోట్ల బకాయిల గురించి కేసీఆర్‌ను ప్రశ్నించే దమ్ము జగన్‌కి లేదని ఎద్దేవా చేశారు.