హోటళ్లలో వంటలపై ప్రజల అనుమానాలను నిజం చేశారు.. నెల్లూరులోని కొందరు కల్తీగాళ్లు. శాఖాహారం.. మాంసాహారం తేడా లేకుండా.. ఐస్ క్రీములతో సహా కల్తీ చేసేస్తున్నారు. ఈ మధ్య నిర్వహించిన దాడుల్లో.. అధికారులు ఈ దారుణాన్ని గుర్తించారు. పురుగులు పట్టిన ఆహారాన్ని.. రోజుల తరబడి నిల్వ ఉంచిన పదార్థాలను బయటపెట్టారు. అప్పటికే కుళ్లిపోయిన మాంసానికి రంగులు పూస్తున్న విషయాన్ని గుర్తించారు. వాటికే మసాలాలు దట్టిస్తూ.. జనాన్ని మోసం చేస్తున్న తీరును బయటపెట్టారు.
బిరియానీ దర్బార్.. సింహపురి రుచులు.. ప్రిన్స్ హోటల్... మూలపేట అలంకార్ సెంటర్లోని సాయి హోటల్‌తో పాటు.. ఐస్ క్రీమ్ సెంటర్లు, బస్టాండ్ సమీపంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, మాంసం దుకాణాల్లో అధికారులు తనిఖీలు చేశారు. చాలా చోట్ల కుళ్లిన మాంసం, మురిగిన కూరగాయలు, దుర్వాసనతో ఉన్న రొయ్యలు చూసి... అధికారులకే కళ్లు తిరిగినంత పనైంది. నెల్లూరుతో పాటు కావలి, ఆత్మకూరు, నాయుడుపేటల్లోనూ కల్తీదందా బయటపడింది. ఇలాంటివి తింటే.. జీర్ణకోశ వ్యాధులు ఖాయమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.