MLA Kotam Reddy warned : ప్రజా సమస్యలపై గెరిల్లా తరహా ఉద్యమాలు చేస్తాం.. ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై ఒత్తిడికి పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం అని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై ఇక నుంచి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. గృహ నిర్బంధం చేసి ప్రజా ఉద్యమాలను పోలీసులు ఆపలేరని గట్టిగా చెప్పారు. క్రిస్టియన్ సోదరుల కోసం కమ్యూనిటీ హాలు నిర్మాణానికి 150 అంకణాల స్థలాన్ని కేటాయించారని, ప్రభుత్వాన్ని 7 కోట్ల రూపాయలు కావాలని కోరితే సీఎం జగన్ అంగీకరించారని తెలిపారు. నిధులు ఇవ్వాలని మూడు వినతి పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ సంతకాలు కూడా చేశారని చెప్పారు. నాలుగేళ్లవుతున్నా నిధులకు అతీగతీ లేదని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి క్రిస్టియన్ సోదరుల నుంచి పది రోజులుగా విజ్ఞాపనలు పంపామని చెప్తూ.. అయినా స్పందించక పోవడంతో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాం అని ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడించారు. నిరసన కార్యక్రమాన్ని, ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు.
కమ్యూనిటీ హాల్ కావాలని అనేక రకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. అదే విధంగా మైనార్టీ సోదరుల కోసం షాదీఖానా కావాలని అడిగాం. ఆ మేరకు స్థలాలు కేటాయింపు కూడా పూర్తయ్యింది. కానీ, నాలుగేళ్లవుతున్నా నిధులు విడుదల చేయడం లేదు. ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగిస్తాం. సమస్యల పరిష్కారానికి గెరిల్లా తరహాలో ఉద్యమిస్తాం. -కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే