Nara Lokesh Yuvagalam Padayatra: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణకు ఉదయగిరిలో ఉన్న 3వేల ఎకరాలపై కన్నుపడిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైసీపీ నేతలు లూఠీ చేసిన ప్రతి రూపాయి వడ్డీతో సహా కక్కిస్తామన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో లోకేశ్.. వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
పేద ప్రజలను జగన్ మోసం చేశారు: మద్యపాన నిషేధం హామీని జగన్ విస్మరించారని నారా లోకేశ్ మండిపడ్డారు. 45 సంవత్సరాలు దాటిన పేద మహిళలకు పింఛను ఇస్తామని జగన్ మోసం చేశారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తల్లికి వందనం పేరుతో పిల్లలందరికీ ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి జగన్ మోసం చేశారన్న లోకేశ్.. టీడీపీ గెలిచాక ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.
ప్రతి రూపాయీ కక్కిస్తాం..: నారా లోకేశ్ ఉదయగిరిపై హామీల వర్షం: ఉదయగిరిలో కిడ్నీ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న లోకేశ్.. ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో పసుపు, బత్తాయి రైతులను ఆదుకుంటామని చెప్పారు.
ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదు: టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోరాటాలు చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ అణిచి వేస్తున్నాడని విమర్శించారు. పాదయాత్రను ఒక్క అడుగు కూడా వెయ్యనివ్వం అన్నారని.. 2 వేల కిలోమీటర్లు నడిచానని అన్నారు. పాదయాత్రలో రైతుల బాధలు చూశానని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పారు. తనపై ఇప్పటి వరకూ 20 కేసులు పెట్టారని.. అయినా సరే తాను భయపడేదే లేదని తెగేసి చెప్పారు.
వైసీపీ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి: ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి రంగాల్లో ఉద్యోగాలు ఇస్తామన్న లోకేశ్.. ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని పేర్కొన్నారు. అదే విధంగా బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ఉదయగిరిలో పసుపు, బత్తాయి రైతులను ఆదుకుంటామని తెలిపారు.
వడ్డీతో సహా చెల్లిస్తా: జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడని.. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్.. 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తల జోలికి వచ్చిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదని.. వడ్డీతో సహా చెల్లిస్తామని నారా లోకేశ్ హెచ్చరించారు.