పది మంది కలిసి కర్రలతో అతి దారుణంగా దాడి చేశారు.. కనికరం లేకుండా విచక్షణారహితంగా హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా పూడ్చిపెట్టారు. దాదాపు 27 రోజుల తర్వాత మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. గుప్త నిధుల కోసం తీసుకున్న డబ్బులు ఇవ్వలేదనే కోపంతో పది మంది కలిసి ఓ వ్యక్తిని చంపేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.
గుప్త నిధుల తవ్వకాల్లో విభేదాలు.. దారుణ హత్య! - నెల్లూరు జిల్లాలో గుప్త నిధుల హత్య
13:09 September 30
గుప్తనిధుల తవ్వకాల వాటాలపైనే హత్య జరిగినట్లు ప్రచారం
పోలీసుల వివరాల ప్రకారం.. పొదలకూరు మండలం అగచాట్లపురానికి చెందిన అబ్దుల్ కరీం కుమారుడు రఫీ(32)కి వివాహమైంది. ఆయన గుప్త నిధుల కోసం అన్వేషిస్తుండేవాడు. స్థానిక దర్గాల వద్దకు వెళుతూ తాయిత్తులు ఇస్తుంటాడు. గుప్త నిధులు తవ్విస్తానని పలువురు నుంచి డబ్బులు తీసుకున్నాడు. తిరిగి ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో కొందరు బాధితులు ఆయన్ను నిలదీశారు. తామిచ్చిన డబ్బులివ్వాలని బెదిరించారు. అప్పటికి ఆయన డబ్బులు ఇవ్వలేదు. దాంతో మోసపోయిన బాధితులు పది మంది కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. ఎలాగైనా రఫీని అంతమొందించాలని నిర్ణయించారు.
ఈ నెల 3న ఇంట్లో ఉన్న రఫీని ఫోను చేసి పిలిపించారు. అక్కడనుంచి తీసుకెళ్లి నెల్లూరు గ్రామీణం చింతారెడ్డిపాలెం యలమదిన్నె వద్దకు రాగానే అతిదారుణంగా దాడి చేశారు. పది మంది కలిసి కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. దాంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అక్కడే గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టేశారు. హత్య చేసింది తామేనని అనుమానం రాకుండా నిందితులే రఫీ ఇంటికి వెళ్లి ఆరా తీశారు. తమ డబ్బులు తీసుకుని పారిపోయాడంటూ నమ్మబలికారు. తన భర్త ఇంటికి రాలేదని, ఫోను స్విచాఫ్ వస్తోందని భార్య ఈనెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొదలకూరు ఎస్సై కరిముల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రఫీ గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. గుప్త నిధుల కోసం తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో చింతారెడ్డిపాలెంలోని యలమవారి దిన్నె వద్ద ఉన్నట్లు పోలీసులు నిర్ధరించి మృతదేహాన్ని వెలికితీశారు. దాదాపు నెల రోజులు కావడం మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా బదలాయించి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి:నెల్లూరు: యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య