ఎంపీ అభ్యర్థుల ఖరారుపై తెదేపా వేగం పెంచింది. నెల్లూరు, ఒంగోలు పార్లమెంటు స్థానాలను ఈసారి కైవసం చేసుకోవాలని పార్టీ పట్టుదలతో ఉంది. బీదా మస్తాన్ రావు, మంత్రి శిద్ధా రాఘవరావును బరిలో దింపాలని అభిప్రాయపడుతోంది. శిద్దాను ఒంగోలు ఎంపీగా పోటీచేయిస్తే..దర్శికి కదిరి బాబురావు, ఉగ్రనరసింహారెడ్డి పేర్లు పరిశీలిస్తోంది.
ఆ రెండింటిపై సైకిల్ ప్రత్యేక గురి! - వైకాపా
''కిందటిసారి ఆ రెండు స్థానాలు చేజార్చుకున్నాం. ఈసారి ఎలాగైనా... సవారీ చేయాలి'' అని తెదేపా అధిష్ఠానం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్లు ఖరారు చేసినా... వారిని మళ్లీ ఎంపీలుగా బరిలో దించాలని పునరాలోచిస్తోంది. ప్రత్యర్థి పార్టీకి ఆ ఎంపీ స్థానాలను దక్కకుండా వ్యూహాలు చేస్తోంది. అందుకే ఒంగోలు నుంచి మంత్రి శిద్దా రాఘవరావును... నెల్లూరు నుంచి బీదా మస్తాన్ రావును బరిలో దించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అధిష్ఠానం మనసులో మాట తెలుసుకున్న శిద్దా రాఘవరావు తెదేపా అధినేతతో సమావేశమయ్యారు. ఎంపీగా పోటీ చేసేందుకు నియోజకవర్గ కార్యకర్తలు ఒప్పుకోవడం లేదని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందున ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నట్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. తన కుటుంబ సభ్యులు అభిప్రాయం తీసుకోవాల్సి వస్తుందని శిద్దా తెలిపారు
నెల్లూరు మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు చంద్రబాబుతో భేటీ అయ్యారు. నెల్లూరు లేదా ఒంగోలు పార్లమెంట్ స్థానాల్లో ఒక దాని నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. అధిష్ఠానం ఆదేశం మేరకు ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమేనని మస్తాన్ రావు స్పష్టం చేశారు. నెల్లూరు, ఒంగోలులో ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలవడం ఖాయమని బీద అభిప్రాయ పడ్డారు.
నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డితోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. ఈసారి టికెట్ తన కుమార్తెకు ఇవ్వాలని ఎస్పీవై రెడ్డి కోరారు. నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎవరీ పేరు ఖరారు చేయలేదని, అందుకే నంద్యాల ఎంపీ సీటు తన కుమార్తెకు అడుగుతున్నట్లు ఎస్పీవై వెల్లడించారు. మరోసారి చంద్రబాబును కలసి...మహిళా కోటాలో తన కుమార్తెకు సీటు ఇవ్వాలని కోరనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం కోసం బొడ్డు భాస్కర రామారావు, గన్ని కృష్ణా రేసులో ఉన్నారు. బొడ్డు భాస్కరరామారావు పేరును తూర్పుగోదావరిలోని ప్రముఖ నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. సమీకరణాల్లో భాగంగా పనబాక కుటుంబం త్వరలో తెదేపాలో చేరుతుందని..ప్రచారం సాగుతోంది. ఈ మేరకు పనబాక కుటుంబంలో ఒక్కరిని తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.