MLA Kotamreddy fire on Officials: నెల్లూరు జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో అధికారుల తీరుపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో జరిగిన ఈ సమావేశానికి మంత్రి కాకాణి, కలెక్టర్ చక్రధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నాలుగేళ్లగా రూరల్ నియోజకవర్గంలో పనులేమీ జరగడం లేదని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి జగన్ మంజూరు చేసిన పనులకు సైతం అధికారులు ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వడం లేదన్నారు.
బారాషాహీద్ దర్గాలో రూ.15 కోట్ల నిధులతో ముఖ్యమంత్రి అభివృద్ధి పనులు మంజూరు చేస్తే, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వలేదని తెలిపారు. బీసీ భవన్, అంబేద్కర్ భవన్, మైనార్టీ గురుకుల పాఠశాల పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేవని అభివృద్ధి పనులు ఆపేసిన అధికారులు, కోటి రూపాయల వ్యయంతో నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నివాసం నిర్మించడం ఏమిటని ప్రశ్నించారు.