ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోర్కెల పండుగకు... పెద్ద ఎత్తున పోటెత్తుతున్న భక్తులు

నెల్లూరు బారాషాహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. కోర్కెల పండుగగా పిలిచే ఈ వేడుకలు మతసామరస్యానికి ప్రతీక. పొరుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.

రొట్టెల పండుగ

By

Published : Sep 12, 2019, 4:50 AM IST

Updated : Sep 12, 2019, 7:25 AM IST

కోర్కెల పండుగకు పోటెత్తుతున్న భక్తులు

నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు ఒక విశిష్టత ఉంది. ప్రపంచ శాంతికి నెల్లూరు వచ్చిన 12 మంది మతబోధకులు నెల్లూరులో వీరమరణం పొందారని విశ్వసిస్తారు. 12 సంఖ్యను ఉర్దూలో బారా అని, అమరులను షహీద్‌ అని అంటారు. ఈ రెండింటినీ కలిపి దర్గాకు బారాషహీద్‌ అని నామకరణం చేసినట్లు చెప్తారు. మొహర్రం సందర్భంగా బారా షహీదులకు ప్రార్థనలు నిర్వహించి కోరికలు నెరవేరాలని రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటారు. రొట్టెలు తీసుకున్న వారు వాటిని తిని వచ్చే ఏడాది మళ్లీ వచ్చి ప్రార్థించేవారికి రొట్టెలు పంచుతారు. దర్గా పక్కనే ఉన్న స్వర్ణాల చెరువు వద్ద జరిగే ఈ వేడుక కులమతాలకు అతీతంగా జరగడమే దీని ప్రత్యేకత. ఏ కోరిక కోరుకున్నా అవి సిద్ధిస్తాయని నమ్ముతుంటారు భక్తులు.

రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైన బారాషహీదుల గంధ మహోత్సవం అర్ధరాత్రి ఘనంగా జరిగింది. కోటమిట్టలోని అమినియా మసీదు నుంచి గంధాన్ని 12 బిందెల్లో దర్గాకు తీసుకువచ్చి, ప్రార్థనలు నిర్వహించి బారా షహీదులకు లేపనం చేశారు. ఆ గంధాన్ని భక్తులకు పంచారు. రాత్రి సమయంలోనూ షాహీద్‌ల సమాధుల దర్శనానికి భక్తులు బారులు తీరారు.

రొట్టెల పండుగ గురువారంతో మూడో రోజుకు చేరింది. ఈ నెల 10న ఈ వేడుక ప్రారంభమైంది. మొదటి రోజు రెండు లక్షల మంది. రెండో రోజు మూడులక్షలకు పైగా భక్తులు తరలివచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మూడో రోజు భక్తుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని అంటున్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా అధికారులు చక్కని ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు భద్రత, పారిశుద్ద్య ఏర్పాట్లు చేశారు

రొట్టెల కార్యక్రమం కోసం స్వర్ణాల చెరువులో అధికారులు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేశారు. ఉద్యోగ రొట్టె, చదువు రొట్టె, సంతాన రొట్టె, ఆరోగ్యరొట్టెల పేర్లతో భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. రేపు తహలీల్‌ ఫాతెహా, శనివారం ముగింపు సభ నిర్వహిస్తారు.

Last Updated : Sep 12, 2019, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details