Silica Mining in Nellore District: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు, కోట మండలాల్లో సిలికా దోపిడి.. యథేచ్ఛగా సాగుతోంది. నాలుగేళ్లుగా అధికార పార్టీ అగ్రనాయకులు అక్రమాలతో చెలరేగిపోతున్నారు. ఈ రెండు మండలాల్లోకి కొత్త వ్యక్తులు, అధికారులు అడుగుపెట్టాలంటే భయపడిపోతారు. అక్కడ మైనింగ్ చేసే దళారీలు ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకుని ఉంటారు.
పొలాల్లో, తీరప్రాంతాల్లో ఉండాల్సిన సిలికాను రోడ్ల మీదకు తీసుకొచ్చి కుప్పలుగా పోస్తున్నారు. 30కి పైగా అనధికార డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసి లోపలికి ప్రవేశం లేకుండా కంచె వేశారు. లోపలికి ప్రవేశం లేకుండా ఇనుప గేట్లు నిర్మాణం చేశారు. వాటికి పోలీసులు రక్షణగా ఉంటారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. అనుమతి లేకుండా ఎవరైనా ప్రవేశిస్తే దాడి చేస్తారు. తమ భూముల్ని లాక్కుని సిలికా తవ్వకాలు చేపడుతున్నారని స్థానిక రైతులు వాపోతున్నారు. ఈ అక్రమాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులు, స్థానికులు పడుతున్న బాధలు చూసిన అఖిలపక్షం నేతలు ఈ ప్రాంతంలో పర్యటించారు. అఖిలపక్ష నేతలకు.. గ్రామస్థులు విస్తుపోయే విషయాలను వివరించారు. ఇక్కడ 70 మంది అనుమతి పొందిన లీజుదారులు ఉన్నారు. వారిని బెదిరించి అధికార పార్టీ నాయకులు క్యూబిక్ మీటరు సిలికాను 100 రూపాయలకు తీసుకుంటున్నారు. ఇవ్వనంటే లీజులు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని అఖిల పక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
రైతుల పంటలు సాగు చేసుకునే పొలాల్లో సిలికా తరలించేందుకు క్యూబిక్ మీటరుకు 30 రూపాయలు చెల్లిస్తున్నారు. వారి అక్రమాలను ప్రశ్నించిన 33 మంది రైతులపై కేసులు నమోదు చేయించారు. కొనుగోలు చేసిన అధికారపార్టీ నాయకులు క్యూబిక్ మీటరు సిలికాను 1485 రూపాయలకు ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని అఖిల పక్ష నేతలు ఆరోపిస్తున్నారు. రైతులకు అన్యాయం జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.