Evidence of theft in Nellore court: నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి సాక్ష్యాధారాల చోరీకి గురైన కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. దీనిపై నెల్లూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన నివేదికపై విచారణ చేసిన హైకోర్టు.... దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసులకు అంత ప్రాధాన్యత ఇస్తున్న వేళ.. నెల్లూరులోని సంబందిత కోర్టు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు 'నేర ఆధారాలను' భద్రపరిచే వ్యవహారంలో మరింత జాగ్రత్త వహించి ఉండాల్సిందని హైకోర్టు పేర్కొంది. నేర నిరూపణ ఆధారాలను న్యాయస్థానం ముందు ఉంచకపోతే.. ప్రజాప్రతినిధులపై కేసులు వీగిపోయే ప్రమాదం ఉందని తెలిపింది.
ఈ పరిస్థితుల్లో నెల్లూరు కేసు అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నట్లు చెప్పింది. నేరగాళ్లను చట్టముందు నిలబెట్టి శిక్షించేందుకు సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకపోతే... న్యాయవ్యవస్థపై సామాన్య ప్రజలకు విశ్వాసనం పోతుందని అభిప్రాయపడింది. పలుకుబడి ఉన్న వ్యక్తులు నిందితులుగా ఉన్న ఈ కేసులో... ఆధారాల చోరీ విషయంలో ఎవరి పాత్ర ఉందనే మూలాలను తేల్చాల్సి ఉందని పేర్కొంది. ఆధారాల చోరీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశిస్తే తమకు అభ్యంతరం లేదని... రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తరపున్యాయవాది రంగపాణిరెడ్డి, సీబీఐ న్యాయవాది తెలిపారని గుర్తుచేసింది.
ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని... హైకోర్టు తరపు న్యాయవాది N.అశ్వనీకుమార్ వివరించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. ఆధారాల చోరీపై నెల్లూరు చిన్నబజారు ఠాణాలో నమోదు చేసిన కేసు ఫైళ్లను సీబీఐకి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది. దర్యాప్తు విషయంలో సీబీఐకి సహకరించాలని నెల్లూరు జిల్లా ఎస్పీని ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి, సంబంధిత కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయాలని సీబీఐ దర్యాప్తు అధికారికి స్పష్టంచేసింది.