మీ పిల్లలని ఎక్కడ చేరుస్తున్నారని ఎవరినైనా అడిగితే ఏదో ఒక కార్పొరేట్ పాఠశాల పేరు ఠక్కున చెబుతారు చాలామంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తామని ఎవరూ చెప్పరు. నెల్లూరు నగరంలోని భక్తవత్సల నగర్లో ఉన్న కేఎన్ఆర్ పురపాలక పాఠశాల మాత్రం ఇందుకు మినహాయింపు. ఆ పాఠశాలలో పిల్లలను చేర్చడానికి తల్లితండ్రులు క్యూ కడుతున్నారు. పాఠశాలలు ప్రారంభానికి 44 రోజులే ఉంది. ఇప్పటి నుంచే సీటు కావాలంటూ తల్లిదండ్రులు తంటాలు పడుతున్నారు.
జిల్లాలోనే ప్రథమ స్థానం..
విద్యార్ధుల సంఖ్య అపరిమితంగా ఉన్న కారణంగా ఈ విద్యా సంవత్సరానికి కేఎన్ఆర్ పురపాలక పాఠశాలలో 7, 8, 9, 10 తరగతుల్లో ప్రవేశం లేదు. సీట్లు లేవు. ఆరోతరగతికి మాత్రమే సీట్లు ఉన్నాయనే బోర్డు కేవీఆర్ ప్రభుత్వ పాఠశాల ప్రవేశ ద్వారం వద్ద పెట్టారు. ఇంతలా కేఎన్ఆర్ పాఠశాల వృద్ధిలోకి రావడానికి.. ఇక్కడ 15 ఏళ్లుగా ప్రధానోపాధ్యాయుడిగా చేస్తున్న ప్రకాశ్ రావు కృషే కారణం. ప్రతి ఏటా కార్పొరేట్ బడులకు దీటుగా ఫలితాలు తెప్పిస్తున్నారు. 2010లో సుధీర్ అనే విద్యార్థి 582 మార్కులతో రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించారు. అప్పటి నుంచి ఈ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరుగుతూ వచ్చింది. ఏటా జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది.