సొంతింటి కల సాకారం కోసం ఎదురుచూపులు నెల్లూరు వెంకటేశ్వరనగరలో షీర్ వాల్ టెక్నాలజీతో అత్యాధునికంగా నిర్మించిన పేదల గృహాలు లబ్ధిదారులను ఊరిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పురపాలక మంత్రి నారాయణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఇళ్లను శరవేగంగా నిర్మించారు. విశాలమైన రహదారులు, పార్కులతో రాష్ట్రంలోనే అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. లబ్దిదారుల ఎంపిక, గృహప్రవేశాలు సైతం పూర్తిచేసుకున్నా...విద్యుత్, నీటి సౌకర్యం వంటి పనులు మిగిలిపోయిన పరిస్థితుల్లో.. ప్రజలు ఇళ్లలోకి రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా... పట్టించుకునే వారు ఎవరూ లేక గృహాలు పాడైపోతున్నాయి.
కళావిహీనంగా.. తాగుబోతులకు అడ్డాగా...
3 నెలల క్రితం వరకు పచ్చదనంతో కళకళలాడిన ప్రాంతం... అప్పుడే వెలవెలబోతోంది. నీరులేక చెట్లు ఎండిపోతున్నాయి. ఇళ్లల్లోని గోడలకు బూజుపట్టి అపరిశుభ్రంగా తయారయ్యాయి. కిటికీల అద్దాలు పగిలిపోతుండగా.... రోడ్లు, పార్కులు అపరిశుభ్రంగా మారాయి. తాగుబోతులు, ఆకతాయిలకు ఈ ప్రాంతం అడ్డాగా మారింది.
వసతులు కల్పన పూర్తి చేస్తేనే..
అత్యాధునిక హంగులతో 4వేల 800 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసినా....తుది దశ పనుల్లో నిర్లక్ష్యంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తే సొంతింటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. వీలైంత త్వరగా మిగిలిన పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లు అప్పగిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు. పచ్చదనంతో కళకళలాడిన కాలనీ కళ్లముందే పాడైపోతుండటంపై లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.