Urea At Higher Prices: వ్యవసాయ సీజన్లో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. గత రెండేళ్ళుగా ప్రతి రబీ సీజన్లో ఈ సమస్య ఉత్పన్నం అయ్యింది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఎరువులు బయట మార్కెట్‌కు తరలిపోవడంతో వ్యాపారులు కృత్తిమ కొరతను సృష్టిస్తున్నారు. సాగు ఖర్చులు పెరుగుతున్నాయని రైతులు అల్లాడుతున్నారు. నెల్లూరు జిల్లాలో రబీ సీజన్లో ఆరు లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఒక్కసారిగా ఇంత మంది రైతులకు యూరియా సప్లై చేయలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు.
యూరియా పక్కదారి:ధాన్యాగారంగా పేరున్న నెల్లూరు జిల్లాలో రైతులను వ్యాపారులు నిలువుదోపిడీ చేస్తున్నారు. జిల్లా అధికారుల వైఫల్యాల కారణంగా అధికార పార్టీనేతలు యూరియాను పక్కదారి పట్టించడంతో బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. సాధారణంగా యూరియా ఆర్బీకేలు, పీఏసీఎస్‌ల్లో 266 రూపాయలకు విక్రయిస్తారు. వ్యాపారులు మాత్రం 320నుంచి 360రూపాయలకు అమ్ముతున్నారు. బస్తాకు 60 నుంచి 90రూపాయలు లాభం వస్తుండటంతో వ్యాపారులు అధికార పార్టీ నేతల అండదండలతో ప్రభుత్వం నుంచి వచ్చిన యూరియాను దారిమళ్లీస్తున్నారు. ఆర్బీకేలు, పీఏసీఎస్ కేంద్రాల వద్ద 20శాతం మంది రైతులకు మాత్రమే అందుతుంది. మిగిలిన రైతులు పోరాటం చేయలేక వ్యాపారుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాకు 65వేల టన్నుల యూరియా సరఫరా అయ్యింది. సక్రమంగా పంపిణీ చేస్తే రైతులు బ్లాక్ మార్కెట్ లో కొనాల్సిన అవసరం లేదని అంటున్నారు.
యూరియా చల్లాల్సింది పిండి చల్లుతున్నాం. ఎవ్వరికి వస్తున్నాయో ఎవ్వరికి పోతున్నాయో, పెద్ద పెద్ద వాళ్లకు ఇస్తున్నారు 1,2 ఎకరాలు ఉన్న వాళ్లకు ఇవ్వటం లేదు. కూర్చోని కూర్చోని గమ్మున వస్తున్నాం. సేద్యానికి డబ్బులు అయిపోతున్నాయి. -రైతు