ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సినిమా థియేటర్లు మూసివేత... పాఠశాలలకు సెలవులు - కరోనా

రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఇటీవలే ఇటలీ నుంచి నెల్లూరు జిల్లాకు వచ్చిన ఓ యువకుడికి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలింది. అతణ్ని ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. అప్రమత్తమైన జిల్లా అధికారులు వైరస్‌ విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి జ్వర, జలుబు పీడితులు ఎవరైనా ఉన్నారేమో అని పరీక్షిస్తూ... ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Corona Alert in Nellore district
సినిమా థియేటర్లు మూసివేత... పాఠశాలలకు సెలవులు

By

Published : Mar 14, 2020, 7:03 AM IST

సినిమా థియేటర్లు మూసివేత... పాఠశాలలకు సెలవులు

రాష్ట్రంలో కరోనా లక్షణాలతో చాలామంది ప్రభుత్వాసుపత్రిలో చేరినా... ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో... నెల్లూరులో తొలికేసు వెలుగుచూసింది. అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇటీవలే ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి వైరస్‌ సోకినట్లు నిర్ధరణ కావడంతో... అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన జిల్లా అధికారులు వైరస్‌ విస్తరించకుండా చర్యలు చేపట్టారు.

ప్రజలు ఎక్కువగా గుమిగూడే థియేటర్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ వంటి ప్రదేశాలను మూసేస్తున్నారు. జిల్లాలో అన్ని క్రీడా పోటీలకు అనుమతులు రద్దు చేశారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని... ఈ వైరస్‌ను సమర్ధంగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని అధికారులు భరోసా కల్పించారు. ముందుజాగ్రత్త చర్యగా ఇవాళ్టి నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలలకు 5 రోజులు సెలవులు ప్రకటించారు. ప్రత్యేక బృందాలు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పించాయి. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రతి వార్డునూ జల్లెడపడుతున్నారు. ఇటీవల విదేశాల నుంచి ఎవరైనా వచ్చారేమోనని ఆరా తీస్తున్నారు.

కడప రిమ్స్‌ ఆసుపత్రిలో కరోనా అనుమానిత లక్షణాలతో ముగ్గురు చేరగా... అందులో ఇద్దరికి వైరస్‌ లేదని తేలింది. మరొకరికి ఇంకా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కరోనా వైరస్‌ లక్షణాలతో గురువారం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేరిన 30 ఏళ్ల మహిళకు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌ అని తేలింది. విజయవాడ క్రీస్తు రాజుపురం ప్రాంతానికి ఇటీవలే ఇటలీ, ఇండోనేషియా దేశాల నుంచి వచ్చిన ఐదుగురు యువకుల పరిస్థితిని అక్కడి ఆరోగ్యశాఖ సిబ్బంది వాకబు చేశారు. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్‌లో కరోనాపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

కరోనా వ్యాప్తి నివారణకు ఓ వైపున అధికారులు అప్రమత్తమవుతుంటే... ఆ మహమ్మారి దెబ్బకు రాష్ట్రంలో చికెన్‌ మార్కెట్‌ కకావికలమైంది. కిలో చికెన్‌ ధర 30 రూపాయలకు పడిపోయింది. ధర తగ్గినందున కొనుగోళ్లు భారీగా పెరిగాయని... ఐతే లాభాలు మాత్రం ఉండట్లేదని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్‌ ప్రియులు కోడి మాంసాన్ని ఎగబడి కొంటున్నారు.

ఇదీ చదవండీ... దేశంలో 81కి చేరిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details