నెల్లూరు నగరం చుట్టూ సర్వేపల్లి, కృష్ణపట్నం, జాఫర్ సాహెబ్ కాలువలు ఉన్నాయి. వీటి సమీప ప్రాంతంలో 20డివిజన్ల కాలనీల ప్రజలు నివసిస్తారు. నగరానికి అందాన్నిచ్చే కాలువలు.. ఇప్పుడు డంపింగ్ యార్డులుగా మారాయి. కాలనీల్లో చెత్తను తెచ్చి కాలువ గట్లపై పడేస్తున్నారు. గాలి, వర్షపు నీటితో ఆ చెత్తంతా కాలువల్లోకి చేరి నీటి ప్రవాహానికి అడ్డం పడుతోంది. పలుచోట్ల జంతు కళేబరాలను కూడా కాలువల్లో వేస్తుండటంతో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోందని స్థానికులు వాపోతున్నారు.
నెల్లూరు నుంచి అల్లిపురం, నరుకూరు, టీపీగూడూరు వరకు కాలువ పొడవునా నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముత్తుకూరు, కృష్ణపట్నం వరకు ఉన్న కాలువల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. కాలువ గట్లు, రోడ్లపై చెత్త వేస్తున్నా.. నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలువల్లో కుళ్లిన చెత్త, దోమలు, క్రిమికీటకాలు వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలవనరుల శాఖ, నగరపాలక సంస్థ అధికారులు తక్షణమే స్పందించి.. కాలువ గట్లను శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.