నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సంగం సమీపంలో ఆటోను లారీ ఢీకొనడంతో.. బీరాపేరు వాగులో ఆటో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. మరో ఐదుగురు గల్లంతయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. ఆత్మకూరు నుంచి సంగంలోని శివాలయంలో నిద్ర చేసేందుకు 12 మంది ఆటోలో బయల్దేరారు. సంగం సమీపంలోని బీరాపేరు వాగుపై ఉన్న వంతెన దాటుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో వాగులో పడిపోయింది.
Accident: ఆటోను ఢీకొన్న లారీ.. చిన్నారి మృతి.. వాగులో ఐదుగురు గల్లంతు - వాగులో ఐదుగురు గల్లంతు
21:27 December 09
సంగం దగ్గర ఆటోను ఢీకొన్న లారీ
పోలీసులు, రహదారిపై వెళ్తున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టి, వాగులో కొట్టుకుపోతున్న ఏడుగురిని కాపాడారు. గల్లంతైన ఐదుగురి కోసం గాలింపు చేపట్టారు. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. బాధితులు ఆత్మకూరు జ్యోతినగర్ వాసులుగా గుర్తించారు.
ఈ ప్రమాదంపై ఎస్పీ విజయారావు స్పందించారు. సమాచారం అందుకోగానే పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నట్టు చెప్పారు. స్థానికుల సహకారంతో ఏడుగురిని కాపాడామని ఎస్పీ వెల్లడించారు. గల్లంతైన ఐదుగురి కోసం గాలిస్తున్నామని, ఇందుకోసం బోట్లు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఘటనాస్థలి వద్ద పోలీసులు ముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతున్నారని ఎస్పీ విజయారావు చెప్పారు.
ఇదీ చదవండి
హెలికాప్టర్ క్రాష్: పార్థివదేహాలను తరలిస్తున్న అంబులెన్స్‌కు ప్రమాదం!