psycho created chaos : నెల్లూరు నడిరోడ్డుపై ఓ వ్యక్తి గందరగోళం సృష్టించాడు. 108 అంబులెన్స్ కు అడ్డుపడి వాహన సిబ్బందిపై బూతుల దండకం అందుకున్నాడు. దీంతో వాహనం గంటసేపు నిలిచిపోగా.. ట్రాఫిక్ స్తంభించింది. అయినప్పటికీ పోలీసులు స్పందించలేదు. నడిరోడ్డుపై పబ్లిక్ పెద్ద ఎత్తున గుమికూడడంతో గంట తరువాత వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి సైకో ప్రవర్తన కారణంగా దాదాపు గంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోవడంపై స్థానికులు, వాహనచోదకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులు ఆలస్యంగా మేల్కొవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక మారుమూల గ్రామాల్లో భద్రత ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు.
గంటకు పైగా నిలిచిన ట్రాఫిక్... నెల్లూరు నగరంలో ఓ వ్యక్తి సైకోలా ప్రవర్తించారు. అత్యవసర సర్వీసులో తిరుగుతున్న 108అంబులెన్స్ ను గంటసేపుపైగా రోడ్డుపైన నిలిపివేశాడు. తనకు అంబులెన్స్ శబ్దం చిరాకు తెప్పిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాహనం కదలకుండా తన స్కూటర్ ని అడ్డుగా పెట్టాడు. మరో స్నేహితుడు అతడిని సమర్థించాడు. ఇరిగేషన్ ఉద్యోగినని రోడ్డుపై హల్ చల్ చేయగా.. మరోవైపు వాహనాలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నడిరోడ్డుపై హల్చల్... నెల్లూరు నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలో స్కూటర్ పై వచ్చిన ఓ వ్యక్తి 108 అంబులెన్స్ సిబ్బందిని నానా బూతులు తిట్టాడు. వినలేని విధంగా తిడుతూ హల్ చేశాడు. అంబులెన్స్ శబ్దం తనకు ఇష్టం లేదని, వెనకనే వస్తుందని, రోజుకు ఎన్ని తిప్పుతారంటూ స్కూటర్ ని అడ్డుగా పెట్టి రోడ్డుపై గందరగోళం సృష్టించాడు.