Ganja Supply Gang Arrested: నెల్లూరు జిల్లాలోకి తెలంగాణా రాష్ట్రం నుంచి తరచూ గంజాయి అక్రమంగా వస్తోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లా సరిహద్దు ప్రాంతాలలోకి అక్రమంగా తీసుకువచ్చి భారీగా విక్రయాలు చేస్తున్నారు. పోలీసులు వారిపై దాడులు చేసి.. వాహనాల్లో తరలిస్తున్న గంజాయి ప్యాకెట్లను పట్టుకుంటున్నారు. సెబ్ అధికారులు ప్రకాశం -నెల్లూరు, నెల్లూరు - చెన్నై సరిహద్దులో ప్రత్యేక బృందాలు ద్వారా నిఘా పెడుతున్నారు.
ఇటీవల కాలంలో పదిసార్లకు పైగా దాడులు చేసి అరెస్ట్‌లు చేశారు. తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి పంపిస్తున్న గంజాయి వ్యాపారులను మాత్రం గుర్తించడం లేదు. అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎవరికి సరఫరా చేస్తున్నారనే విషయాలను కూడా గుర్తించలేకపోతున్నారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా సివిల్ పోలీసులతో పాటు సెబ్ అధికారులు కలిసి పని చేస్తున్నారని అన్నారు.
సీసీ కెమెరాలు, ప్రత్యేక నిఘా బృందాలతో కలసి.. 15 లక్షలు విలువైన 52 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 11 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా నుంచి నెల్లూరుకి గంజాయిని తీసుకువస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడ్డ వారందరూ.. ఇతర రాష్ట్రాలకు గంజాయిని వివిధ పద్ధతుల్లో తరలించి విక్రయిస్తున్నారని తేలింది. వీరి నుంచి 10 మొబైల్స్, మారుతి స్విఫ్ట్ కార్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నలుగురు గంజాయి వినియోగదారులు ఉన్నారు.