ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tenders in Salur హతవిధీ..! 16 సార్లు టెండర్లు పిలిచినా.. ముందుకు రాని గుత్తేదారులు! - సాలూరులో అభివృద్ధి పనుల టెండర్లు

Tenders for Salur Development Works: ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి.. ఇలా 16 దఫాలు. ఇదేమీ వేలం పాట కాదండోయ్..! పార్వతీపురం జిల్లా సాలూరు పురపాలిక పరిధిలో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచిన సంఖ్య. అయినప్పటికీ గుత్తేదారులెవరూ ముందుకు రాని దైన్యం. "బాబ్బాబూ.. అభివృద్ధి పనులు చేయండి, బిల్లులు ఇప్పించే బాధ్యత మాది" అని మంత్రులు సైతం హామీలిచ్చినా ఎవరూ స్పందించలేదు. చివరికి వార్డుల్లో పనులు చేయించుకునే బాధ్యతలను పాలకవర్గ సభ్యులకు అప్పగించారు. గతంలో గుత్తేదారులకు టెండర్ ఇవ్వొద్దన్న కౌన్సిలర్లే నేడు.. మా వార్డుల్లో పనులకు టెండరు వేయండంటూ గుత్తేదారులను బతిమాలుకుంటున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 4, 2023, 1:13 PM IST

Tenders for Salur Development Works: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలికలోని 29 వార్డుల్లో సుమారు 70 వేల మంది జనాభా ఉన్నారు. అభివృద్ధి పనులను అధికారులు గుర్తించి ప్రతిపాదనలు తయారుచేసి టెండర్లు పిలుస్తున్నా.. గుత్తేదారులు ముందుకు రావడం లేదు. పట్టణాభివృద్ధికి కేంద్రం మంజూరు చేసిన నిధులు కోట్లలో ఉన్నా గతంలో చేసిన బిల్లులు చెల్లించకపోవడం వల్ల.. కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

14వ ఆర్థిక సంఘం నిధులు 6కోట్ల 31 లక్షల రూపాయలు మిగిలిపోయాయి. కాలం చెల్లిన వాటిని తిరిగి పంపకుండా విద్యుత్తు ఛార్జీలు, ఎల్ఈడీ దీపాల పేరిట గుత్తేదారులకు ఉన్న పాత బకాయిలను చెల్లించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు మరో ఆరున్నర కోట్లు ఇప్పుడు మూలుగుతున్నాయి. ఈ నిధులున్నా పనులు జరగలేదు. ఫలితంగా పట్టణంలో రోడ్లు, కాలువలు, విద్యుత్, తాగునీటి సమస్యలుఎక్కడివక్కడే నిలిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పురపాలికలో ప్రతిపాదించిన 96 పనులకు ఇప్పటికే 15 సార్లు అధికారులు టెండర్లు పిలిచారు. ఐనా మోక్షం కలగలేదు. 16వ సారి ఆహ్వానిస్తే ఒక్కటే టెండర్ దాఖలైంది. ఒకప్పుడు పనుల కోసం గుత్తేదారులు ఛైర్ పర్సన్, కౌన్సిల్ సభ్యుల వెంట పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. సకాలంలో బిల్లులు రాక గుత్తేదారులు వెనకడుగు వేస్తున్నారు.

వార్డుల్లో తలెత్తుకుని తిరగలేక పోతున్నామని సభ్యులు పలుమార్లు పురపాలక సమావేశాల్లో గోడు వెళ్లగక్కినా పట్టించుకున్న వారే లేరు. అమాత్యుల చేత చెప్పించినా.. గుత్తేదారులు ముందుకు రాలేదు. చివరికి పనులు జరిపించుకునే బాధ్యత కౌన్సిలర్లకే అప్పగించారు. వార్డుల్లో పనులకు టెండరు వేయండంటూ గుత్తేదారులను కౌన్సిలర్లు బతిమాలే పరిస్థితి వచ్చిందని టీడీపీ కౌన్సిలర్లు మండిపడుతున్నారు.

బిల్లులు సకాలంలో చెల్లిస్తామని మంత్రులు బొత్స, రాజన్నదొర హామీ ఇచ్చినా గుత్తేదారుల నుంచి స్పందన లేదు. కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే పనులన్నింటినీ ప్యాకేజీల వారీగా విభజించి నిర్మాణ సంస్థలకు అప్పగిస్తామని పురపాలక కమిషనర్ శంకరరావు తెలిపారు.

"మా గ్రామంలో కరెంట్ స్తంభాలు లేవు. దీంతోపాటు మాకు నీటి సదుపాయం కూడా లేదు. కాలువలు సరిగ్గా లేవు. వర్షాలు పడేటప్పుడు అవి నిండిపోతున్నాయి. చీకటిలో ఎవరైనా.. ఈ ప్రాంతంలో నడిస్తే.. ఈ కాలువలో పడిపోయే అవకాశాలున్నాయి. ఒక పక్క రోడ్లు కూడా సరిగా లేవు. దీనివల్ల ఆ మార్గంలో ప్రయాణించేటప్పుడు.. బైక్​లు స్కిడ్ అయిపోయి.. ఇప్పటికే చాలామంది కాలువల్లో పడిపోయారు. దీనిపై ఎంతమంది అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. ఏ ఒక్క అధికారి కూడా మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు." - గ్రామస్థుల ఆవేదన

16 సార్లు టెండర్లు పిలిచినా.. ముందుకు రాని గుత్తేదారులు!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details