తమ గ్రామ సమస్యలు పరిష్కరించే వరకూ శ్మశానవాటికకు వెళ్లేందుకు దారి ఇచ్చేది లేదంటూ.. ఓ గ్రామస్థులు పొరుగూరి వాళ్లను అడ్డుకున్నారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని పాత కళ్లికోట గ్రామంలో చోటు చేసుకుంది. కొత్తకళ్లి కోటకు చెందిన ఓ వృద్ధురాలు మంగళవారం చనిపోయింది. దీంతో.. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు పాతకళ్లికోట మీదుగా శ్మశానవాటికకు బయల్దేరారు.
శవం శ్మశానానికి చేరాలంటే మా సమస్య పరిష్కరించాల్సిందే - పాతకళ్లికోట కొత్త కళ్లికోట
ఓ వృద్ధురాలు చనిపోయింది. శ్మశానానికి చేరాలంటే పక్కనున్న ఊరు దాటాలి. ఇప్పటి వరకూ దహన సంస్కారాలు సాఫీగానే సాగాయి. కానీ, ఇప్పుడు మాత్రం అడ్డుకున్నారు పొరుగు ఊరివాళ్లు. అధికారులు తమ సమస్య పరిష్కరిస్తే తప్ప, శవం శ్మశానానికి చేరదంటూ భీష్మించారు. ఇంతకీ వాళ్ల సమస్యేంటి, అసలిదంతా జరిగింది ఎక్కడ అన్నది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇక్కడ దహన సంస్కారాలు చేయాలంటే అధికారులు వచ్చి తమ గ్రామ సమస్యలు పరిష్కరించాలని పాతకళ్లికోట గ్రామస్థులు పట్టుబట్టారు. ఇంతకీ వాళ్ల సమస్య ఏమంటే.. తోటపల్లి జలాశయం ముంపు ప్రాంతమైన పాతకళ్లికోటలోని 30 కుటుంబాలకు.. పునరావాసం కింద స్థలాలు, ప్యాకేజీ ఇస్తామని అధికారులు చెప్పారు. కానీ.. ఇప్పటి వరకూ హామీ నెరవేర్చలేదని, వరదలొస్తే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల దాడుల్లో పంటలు ధ్వంసమవుతున్నా.. పరిహారం ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు శవాన్ని కదలనిచ్చేది లేదని భీష్మించారు.
ఈ విషయం తెలుసుకున్న తహసీల్దారు రాధాకృష్ణ, ఎస్సై జగదీశ్‌నాయుడు, ఎంపీపీ శ్యామల గ్రామానికి చేరుకొని వారితో చర్చించారు. నెల రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తహసీల్దారు హామీ ఇవ్వడంతో శవయాత్రకు అనుమతించారు.