Two people died : పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల మండలం నార్నెపాడు మేజర్ కెనాల్లో దూకి ఇద్దరు మృతి చెందిన సంఘట కలవరం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం వెల్చూరు గ్రామానికి చెందిన కృష్ణవేణి (28) అనే మహిళకు, పాకాలపాడుకు చెందిన శానంపూడి హరినాథరెడ్డిలకు కొంతకాలం క్రితం వివాహమైంది. వీరికి మహిధర్‌రెడ్డి అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం కృష్ణవేణి అలిగి పుట్టింటికి వెళ్లింది. పాకాలపాడుకు చెందిన మోదుగుల వెంకటరమణారెడ్డి... తన బావమరిది శానంపూడి హరినాధ్ రెడ్డి భార్య అయిన కృష్ణవేణి ని సముదాయించి తీసుకువచ్చేందుకు ప్రకాశం జిల్లా వెల్చూరుకు వెళ్లారు. కృష్ణవేణితో మాట్లాడి ఆమె కుమారుడితో సహా ద్విచక్రవాహనం మీద ఎక్కించుకుని పాకాలపాడు తీసుకువెళ్తుండగా... నార్నెపాడు వద్ద నున్న మేజర్ కెనాల్ వద్దకు రాగానే ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న కృష్ణవేణి... ద్విచక్ర వాహనం నుంచి ఒక్కసారిగా దిగి కాలువలోకి దూకింది. ఆమెను కాపాడేందుకు వెంకటరమణారెడ్డి కూడా కాల్వలోకి దూకాడు. ఈ క్రమంలో వెంకటరమణారెడ్డి, కృష్ణవేణి ఇద్దరు కాలువలో గల్లంతై మృతి చెందారు. ఇది గమనించిన స్థానికులు వెంకటరమణారెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. కృష్ణవేణి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టగా కొన్ని గంటల తరువాత కృష్ణవేణి మృతదేహం లభ్యమైనట్లు ముప్పాళ్ల ఎస్ఐ పట్టాభిరామయ్య తెలిపారు. కృష్ణవేణి నాలుగేళ్ల కుమారుడు మహిధర్ రెడ్డి తల్లి కనిపించకపోవడంతో ద్విచక్రవాహనంపై ఏడుసున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
అయ్యో పాపం ! కాపురం నిలబెట్టాలని అనుకున్నాడు.. రెండు ప్రాణాలు - పల్నాడు జిల్లా నేర వార్తలు
Two people died : కాపురం నిలబెట్టాలనే ప్రయత్నంలో రెండు ప్రాణాలు గాల్లో కలసిపోయిన విషాద ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో అలిగి పుట్టింటికి వెళ్లిన బంధువుల అమ్మాయిని, తీసుకొచ్చే క్రమంలో..మహిళ ఆవేశంలో కాల్వలోకి దూకింది. ఆమెను కాపాడేందుకు కాల్వలోకి దూకిన వెంకటరమణా రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. బంధువులిద్దరు ఒకే సారి చనిపోపడంతో..గ్రామంలో విషాధఛ్చాయలు అలముకున్నాయి.
కాలువలో దూకి ఇద్దరు ఆత్మహత్య