Twins Marks: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచికి చెందిన..... స్వప్న, స్వాతి కవలలు.!అమ్మఒడిలో కలిసిపెరిగారు. ఒకే బడిలో చదివారు. కారుమంచి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచీ తోటివారిని అనేకసార్లు తికమక పెట్టిన... ఈ కవలలు పదో తరగతి ఫలితాల్లో ఆశ్చర్యపరిచారు. 600 మార్కులకుగాను ఇద్దరూ 578 మార్కులు సాధించారు.
స్వప్న, స్వాతి తండ్రి ఆరేళ్ల క్రితం చనిపోయారు. తల్లి కృష్ణకుమారే వారిని కష్టపడి చదివించారు. కుట్టు మిషన్ కుడుతూ వచ్చిన సంపాదనతోనే పిల్లల్ని చదివిస్తున్నారు. చదువులో పోటీపడే ఇద్దరికీ.. సమాన మార్కులు రావడం కాకతాళీయమే అయినా ఆనందంగా ఉందంటున్నారు కృష్ణకుమారి. తమను చదివించేందుకు తల్లి పడుతున్న కష్టాన్ని ఎప్పుడూ మరువబోమంటున్నారు స్వప్న, స్వాతి. ఇంకా బాగా కష్టపడి మంచి ఉద్యోగాలు సాధిస్తామని చెప్తున్నారు.