water supply in Palnadu district: వేసవి వచ్చిందంటే చాలు పల్నాడు జిల్లాలోని ఆయా గ్రామల్లో ప్రజలకు నీటి తిప్పలు తప్పవు. అయితే అధికారులు ఈ సారి ముందుగా స్పందించారు. రాబోయే వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ముందస్తుగా చెరువులను నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడంతోపాటుగా.. అందుకు తగ్గట్టుగా నిత్యం పర్యవేక్షిస్తూన్నారు. ఈ నేపథ్యంలో ఆర్ ఎస్ ఆర్ సురేష్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని పల్నాడు జిల్లాలో ఉన్న మొత్తం 148 తాగునీటి చెరువులను నింపేందుకు గత పదిహేను రోజులుగా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ ఆర్ ఎస్ ఆర్ సురేష్ తెలిపారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద పూర్తి సామర్ధ్యంతో నిండిన తాగునీటి చెరువును శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఈ సురేష్ మాట్లాడుతూ జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలోని వేల్పూరు, తాళ్లూరు చెరువులు కొద్దిగా సమస్య ఉన్నప్పటికీ నీటితో నింపుతున్నామని తెలిపారు. అవి పూర్తయితే మొత్తం 148 చెరువులు నిండినట్లేనన్నారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా క్రాష్ పోగ్రాం ద్వారా జిల్లాలోని అన్ని మంచినీటి చేతిపంపులు మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తీసుకువచ్చామన్నారు. తాగునీటి పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టేలా డీఈలు, ఏఈలు నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టామని సురేష్ వెల్లడించారు.