Israel Hebrew University team visit to Kondaveedu fort: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు కోటలో ఇజ్రాయిల్ హీబ్రూ విశ్వవిద్యాలయ సంస్కృత భాష శాఖ అధ్యయన బృందం మంగళవారం పర్యటించింది. అక్కడి సంస్కృత భాష ప్రొఫెసర్ ఇగాల్ బ్రోనర్ తోపాటుగా.. 25 మంది హీబ్రూ విశ్వవిద్యాలయ అధ్యాపకులతో విద్యార్థి బృందం కొండవీడు కోటను సందర్శించారు.
కొండవీడు కోటలో ఇజ్రాయిల్ హీబ్రూ విశ్వవిద్యాలయ బృందం అలంకార శాస్త్ర గ్రంథాల మీద ప్రత్యేక అధ్యయనం: కోటలో పలు విషయాలను ఆసక్తికరంగా తిలకించారు. ప్రొఫెసర్ ఇగాల్ సంస్కృత భాష నిపుణుడిగా పని చేస్తున్నారు. ఈయన అలంకార శాస్త్ర గ్రంథాల మీద ప్రత్యేక అధ్యయనం చేశారు. తనతో వచ్చిన విద్యార్థులందరికీ.. రెడ్డి రాజులలో కుమారగిరి రెడ్డి, కాటయ్య వేమారెడ్డి, పెదకోమటి వేమారెడ్డి సంస్కృత కవులని వారు అనేక గ్రంథాలు రాశారని ఆ గ్రంథాల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. కాటయ్య వేముడు కర్పూర వసంత రాజ్యం అనే సంస్కృత గ్రంథాన్ని వ్రాశాడని, పెద్ద కోమటి వేమారెడ్డి ప్రాకృతంలో హాలుడు రాసిన గాథా సప్తశతి 700 శ్లోకాలలో 100 శ్లోకాలు తీసుకొని సంస్కృతంలో వాటికి వ్యాఖ్యానాలు రాశాడని వెల్లడించారు.
పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి వామనభట్ట బానుడని వేమ భూపాల్యమనే (పెద్ద కోమటి వేమారెడ్డి చరిత్ర) సంస్కృత గద్య కావ్యాన్ని రాశాడని, పెద్ద కోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఉన్న విద్యాధికారి శ్రీనాథుడు అనేక చాటు పద్యాలు రాశాడని ప్రొఫెసర్ ఇగాల్ వివరించాడు. కుమారగిరి రెడ్డి బావమరిది కాటయ వేమారెడ్డి సంస్కృత పండితుడని అతడు కాళిదాస నాటక త్రయం మీద వ్యాఖ్యానం రాశాడని వాటిలో ముఖ్యమైనది అభిజ్ఞానశాకంతులమని విద్యార్థులకు తెలిపారు.
బృందంతోపాటు కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డికోటను సందర్శించి.. కోటలో ఉన్న ముఖ్యమైన కట్టడాలను చెరువులను వాటి ప్రాముఖ్యతను వివరించాడు. కొండవీడు కోటపై నీటి అవసరాలకు నిర్మించిన మూడు చెరువులు, వర్షం పడిన సమయంలో కొండలపై నుంచి వచ్చే నీరు.. ఒక చెరువు నిండిన తర్వాత మరొక దానికి వెళ్లే తీరు తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ ఇగాల్ గతంలో ఒకసారి కొండవీడు కోటను సందర్శించానని చెబుతూ.. ఇక్కడికి వచ్చినప్పుడు తనకు ఒక గొప్ప అనుభూతి కలుగుతుందని ఆనందంతో చెప్పాడు. నిర్మాణం పూర్తి కావస్తున్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము, యోగి వేమన మండపం, విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. తెలుగు సాహిత్యంలో యోగివేమన శతక కారుడని.. శతక కారులో యోగివేమన అగ్రగన్యుడని శివారెడ్డి వారికి వివరించాడు. అనంతరం రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శనశాలను సందర్శించారు.
ఇవీ చదవండి: