ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇసుకాసురుల చెరలో కృష్ణమ్మ విలవిల.. నదిలో దారి వేసి మరీ దోపిడీ

By

Published : Apr 9, 2023, 7:35 AM IST

Updated : Apr 9, 2023, 8:39 AM IST

Illegals Digging Sand: అడిగేవారు లేరని.. అడ్డుకునేవారు రారని.. పర్యవేక్షించేవారు పట్టించుకోరని నదీగర్భంలో భారీ యంత్రాలతో ఎడాపెడా ఇసుక తవ్వేస్తున్నారు. ఇందుకోసం నది మధ్యలోకి బాటలు వేసేశారు. ఎప్పుడైనా నదికి వరదలు వస్తే.. ఈ బాటలు.. ప్రవాహానికి అడ్డంకిగా మారి తీర ప్రాంతాలపైకి వరద వెళ్లే ప్రమాదం ఉంది. అధికారం అండగా సాగుతున్న తవ్వకాలతో.. అమరావతి మండలంలో కృష్ణా తీరం భారీ గోతులకు నిలయంగా మారి ప్రమాదకరంగా పరిణమిస్తోంది.

Krishna river Illegals digging sand
ఇసుకాసురుల చెరలో కృష్ణమ్మ విలవిల

ఇసుకాసురుల చెరలో కృష్ణమ్మ విలవిల

Illegals Digging Sand: రాష్ట్రంలో ఇసుకాసురల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. అధికారం అండతో చెలరేగి తవ్వకాలు జరుపుతున్నారు. సొంత లాభం కోసం.. ప్రకృతికి తీరని నష్టం కలిగిస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని కృష్ణా నది తీరం.. అక్రమార్కుల ధనదాహానికి బలైపోతోంది. పెదకూరపాడు నియోజకవర్గంలోని కృష్ణా తీరంలో ఇసుక రీచ్‌లు ఎక్కువ. అమరావతి మండలంలోని ధరణికోట, వైకుంఠపురం, అమరావతి, మల్లాది, అచ్చంపేట మండలం కోనూరు, కస్తల, చింతపల్లి రీచ్‌లలో నాలుగేళ్లుగా ఇసుకను తవ్వుతున్నారు. 2019 అక్టోబరులో గనుల శాఖ ఆధ్వర్యంలో.. ఇసుక రీచ్‌లు నడిపారు. కృష్ణా నదీ గర్భంలో అప్పట్లో కిలోమీటర్ల మేర బాటలు, వంతెనలు ఏర్పాటు చేశారు. 2021లో ఇసుక తవ్వకాలను జేపీ కంపెనీకి అప్పగించాక.. మరింత విచ్ఛలవిడిగా ఇసుక తవ్వకాలు ప్రారంభించారు.

పల్నాడు జిల్లావైపు నుంచి నదిలో తవ్వే ప్రాంతానికి.. నీటి ప్రవాహం దాటి వెళ్లాలి. అందుకోసం ఇసుక రీచ్‌ నిర్వాహకులు నదీపాయలకు అడ్డుగా తూములు వేసి.. ఏకంగా ఓ దారి ఏర్పాటుచేశారు. నదిలో నీరు తూముల గుండా ప్రవహిస్తుండగా.. వాటిపై వేసిన మార్గంలో వాహనాలు వెళ్తున్నాయి. అమరావతి మండలంలో ముత్తాయపాలెం, ధరణికోట, వైకుంఠపురం, అచ్చంపేట మండల పరిధిలో కస్తల, కోనూరు ఇసుక రీచ్‌లలో నదీపాయలపై వంతెనలు నిర్మించి బాటలు వేశారు. ఏటా కృష్ణా నదికి వచ్చే వరద ప్రవాహానికి వంతెనలు, బాటలు దెబ్బతిన్నా.. మరమ్మతులు చేసుకుని వాహనాలు పంపుతున్నారు. నదీ ప్రవాహాన్ని ఇలా మళ్లించడం వల్ల భవిష్యత్తులో విపరిణామాలు చోటు చేసుకుంటాయని.. పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ఎవ్వరూ పట్టించుకోవటం లేదు.

కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలకు జేపీ సంస్థకు అనుమతులు ఇచ్చారు. అయితే గనుల శాఖ అనుమతించిన ఇసుక రేవుల్లోనే తవ్వాలి. కానీ, అమరావతి మండలం ముత్తాయపాలెం రేవులో అనుమతులు లేకుండానే ఇసుకను ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. దర్జాగా నదిలోకి కిలోమీటరు పైగా బాట నిర్మించి.. భారీ యంత్రాలతో ఇసుక తవ్వి తరలిస్తున్నారు. స్థానికులు ఎవరు అడిగినా.. అనుమతులు ఉన్నాయని బుకాయిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత ఒకరు.. ఇసుక తవ్వి తరలించే పనులు చేపట్టినప్పటి నుంచి.. ఈ అక్రమాలు శ్రుతిమించాయి. ముత్తాయపాలెం ఇసుక రీచ్‌కు అనుమతి విషయమై.. భూగర్భగనుల శాఖను.. స్థానికుడొకరు సమాచార హక్కు చట్టం కింద అడగ్గా.. తాము అనుమతులు ఇవ్వలేదని భూగర్భగనుల శాఖ ఉపసంచాలకులు సమాధానం ఇచ్చారు. తరలింపు విషయం తమ పరిధిలోనిది కాదన్నారు. అయినా 120 భారీ తూములు కృష్ణా నదిలో వేసి.. వంతెన నిర్మించి ఇసుక తరలిస్తున్నారు.

కృష్ణా నదిలో వంతెనల నిర్మాణంలో భాగంగా.. తూములపై మట్టిపోసి దారి బలోపేతం చేయడానికి నది ఒడ్డున ఉన్న కట్టమట్టిని తవ్వి తరలిస్తున్నారు. ఈ అక్రమార్కులు కట్ట వెంబడి ఉన్న బండరాళ్లు, మట్టితో పాటు చెట్లను కూడా వదలట్లేదు. నదీతీరంలో మట్టి ఎక్కడ కనిపిస్తే అక్కడ తవ్వేస్తున్నారు. వైకుంఠపురం ఇసుక రీచ్‌కు బాటలు వేసేందుకు సమీపంలో చారిత్రక నేపథ్యం కలిగి ఉన్న వైకుంఠపురం వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న క్రౌంచగిరి కొండను అర్ధరాత్రులు తవ్వి వందల లారీలతో మట్టిని తరలించారు. ఈ కొండ వద్ద కృష్ణా నది ప్రవాహ దిశను మార్చుకుని.. ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. అలాంటి కొండ కింద తవ్వేస్తున్నారు. నది వెంబడి ఉన్న కట్టను, కొండను తవ్వటం వల్ల భవిష్యత్తులో వరదలు వస్తే తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని.. స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక, మట్టి తవ్వకాలపై అధికార పార్టీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయంలో.. ప్రమాణాలు చేస్తామని ప్రకటించడంతో.. అక్రమ తవ్వకాల వ్యవహారం మరోమారు చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చదవండి:

Last Updated : Apr 9, 2023, 8:39 AM IST

ABOUT THE AUTHOR

...view details