ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"నష్టపోయిన రైతులను ఆదుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోంది"

Chandrababu in palnadu: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా తిమ్మాపురం, నాదెండ్ల పరిధిలో దెబ్బతిన్న పత్తి, మిరప పంటలను బాబు పరిశీలించారు. పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. గతేడాది తామర పురుగుతో మిర్చి పాడైందని.. ఈసారి పత్తి వేస్తే వర్షాలు దెబ్బతీశాయని వాపోయారు.

Chandrababu
పల్నాడు జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన చంద్రబాబు

By

Published : Oct 19, 2022, 2:55 PM IST

Updated : Oct 19, 2022, 8:59 PM IST

Chandrababu in palnadu: పల్నాడు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరిశీలించారు. జిల్లాకు వచ్చిన చంద్రబాబుకు తిమ్మాపురం కూడలి వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం తిమ్మాపురం, నాదెండ్ల పరిధిలో వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న పత్తి, మిరప పంటలను బాబు పరిశీలించారు. పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. గతేడాది తామర పురుగుతో మిర్చి పాడైందని, ఈసారి పత్తి వేస్తే వర్షాలు దెబ్బతీశాయని వాపోయారు. లక్షలాది రూపాయల పెట్టుబడులు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఉత్తుత్తి బటన్‌ నొక్కడం తప్ప, రైతుల కష్టాలు పట్టవన్న చంద్రబాబు.. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు.

వ్యవసాయ మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరితాళ్లు : వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని.. రైతుల మెడకు తాడు బిగించి లాగేందుకు సిద్ధంగా ఉన్నారని వైకాపాపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. పత్తి ఎకరాకు రూ.30 వేలు, మిర్చికి రూ.50 వేలు పరిహారం చెల్లించాలన్నారు. సూక్ష్మ సేద్యం పరికరాలు రాయితీతో ఇచ్చిన ప్రభుత్వం తెదేపా అని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేసిన పాపం ఈ ప్రభుత్వానిదని ధ్వజమెత్తారు.

రైతులకు పంట బీమా ఎందుకు ఇవ్వట్లేదో సమాధానం చెప్పాలి: అమరావతి రైతులను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. రైతులు బంగారం పెట్టుకుంటే ఎగతాళి చేస్తున్నారని విమర్శించారు. తన జీవితంలో దాపరికం లేదని.. ఏపీని మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టే వరకూ కృషి చేస్తానని చంద్రబాబు తెలిపారు. రైతులకు సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు అన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులు తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. పంటల బీమా ఎందుకు ఇవ్వట్లేదో ప్రభుత్వం చెప్పలేదన్నారు. ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం కేసులు పెట్టి బెదిరిస్తోందని ధ్వజమెత్తారు. రైతులు పంట నష్టపోయినా కనీసం అధికారులు రావట్లేదన్నారు. గతేడాది పంట నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్​ సీఎం అయ్యాక పెరిగిన రైతుల ఆత్మహత్యలు : జగన్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జగన్ సీఎం అయ్యాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. పల్నాడు జిల్లాలో 155 మంది, గుంటూరు జిల్లాలో 205 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. దేశంలో అత్యధిక అప్పులు ఉన్నది మన రైతులకే అని చంద్రబాబు అన్నారు. రైతులు తలసరి అప్పు రూ.2.45 లక్షలు ఉందన్నారు. రైతులకు విత్తనాలు దొరికే పరిస్థితి లేదని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌ నాటకాలకు కాలం చెల్లిందన్నారు. జగన్‌ మాయమాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వైకాపా ప్రభుత్వానికి బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు.

జగన్​ మాదిరిగానే మరికొంత మంది సైకోలు : పవన్ కల్యాణ్‌కు విశాఖలో పర్యటించే హక్కు లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైకాపా నేతల భూ కబ్జాలు బయటపడతాయని భయమా? అని నిలదీశారు. జనసేన వారిపై దాడులు చేసి మళ్లీ వారిపైనే కేసులు పెట్టించారని దుయ్యబట్టారు. వినుకొండలో ఎమ్మెల్యే రైతును చెప్పుతో కొట్టి జైల్లో వేయించారన్నారు. జగన్‌.. ఆయన మాదిరిగా మరికొందరు సైకోలను తయారు చేస్తున్నారని విమర్శించారు.

"నష్టపోయిన రైతులను ఆదుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోంది"

ఇవీ చదవండి:

Last Updated : Oct 19, 2022, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details