Kotappakonda temple EO and priests Argument issue: పల్నాడు జిల్లా కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయ ఈవో వేమూరి గోపి, అర్చకుల మధ్య వివాదం నెలకొంది. ఈవో వేమూరి గోపి తమపై దుర్భాషలాడుతూ, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అర్చకులు ఆరోపిస్తున్నారు. ఈవోకి వ్యతిరేకంగా ఈ నెల 4వ తేదీ నుంచి ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్టు అర్చకులు తెలిపారు. విషయం తెలుసుకున్న దేవాశాఖ అధికారులు.. డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు.
4వ నుంచి ఆర్జిత సేవలు నిలిపివేస్తాం.. పల్నాడు జిల్లా కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయ ఈవో వేమూరి గోపి, ఆలయ ప్రధాన అర్చకుల మధ్య పలు కీలక విషయాలపై వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఈనెల 4వ తేదీ నుంచి స్వామివారి ఆర్జిత సేవలను నిలిపివేస్తామంటూ.. ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ ఈవో వేమూరి గోపికి వినతిపత్రాన్ని అందజేశారు. వినతిపత్రంలో..''మాపై (అర్చకులు) ఆలయ ఈవో వేమూరి గోపి దుర్భాషలాడుతూ.. ఆయనకు నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు'' అని పేర్కొన్నారు.
ఆలయ ఈవోపై.. ఆలయ ఈవోకే ఫిర్యాదు.. వివాదంపై అర్చకులతో పాటు ఆలయ కార్యాలయ సిబ్బంది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జత కలిసి..ఆలయ ఈవో గోపిపై ఆలయ ఈవోకే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ పాలకవర్గ సభ్యులు, అధికారపార్టీ నేతలు పూనుకుని ఆలయ ఈవో, అర్చకులను సమస్యను పరిష్కరించేందుకు ఆలయ కార్యాలయంలో కూర్చోబెట్టి సుదీర్ఘంగా చర్చలు జరిపారు.