GVR Sastri Comments On Amaravathi: మహాత్మ గాంధీజీ బతికి ఉంటే ప్రస్తుత పరిస్థితి చూసి ఒక కంటితో ఏడ్చేవారని...మరో కంటితో నవ్వేవారని అమరావతి పరిరక్షణ కమిటీ ఛైర్మన్ ఆచార్య జీవీఆర్ శాస్త్రి చెప్పారు. మంగళవారం రాజధానిలో పర్యటించిన ఆయన దీక్షా శిబిరాలను సందర్శించారు. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి దీక్షా శిబిరాలలో రైతులతో సమావేశమయ్యారు. త్వరలోనే తీపి కబురు రాబోతోందన్నారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వ్యక్తులే దీనిని అభివృద్ధి చేయడానికి మళ్లీ ఈ ప్రాంతానికి వస్తారని, సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్రం దాఖలు చేసిన అఫడవిటే మీకు శ్రీరామ రక్ష అన్నారు. అందులో అన్ని వివరాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. అమరావతిని అభివృద్ధి చేయడానికి రాష్ట్రానికి ఉన్న సమస్య ఏంటని ప్రశ్నించారు. దిల్లీలోనే అన్ని తేలుస్తామన్నారు.
కేంద్ర అనుమతి తప్పనిసరి:జాతీయ స్థాయిలో అయోధ్య నిర్మాణానికి ఎలా పోరాటాలు చేశామో అమరావతి పూర్తి చేసేందుకు అంతే కసరత్తు చేస్తున్నట్లు, ఉద్దండరాయిని పాలెంలో రాజధానికి ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. అమరావతి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించాలంటే దానికి కేంద్ర అనుమతి తప్పనిసరి అని జీవీఆర్ శాస్త్రి చెప్పారు. ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే దానికి నిబంధనలు ఒప్పుకోవని శాస్త్రి తెలిపారు. రాజధాని రైతుల ఆకాంక్ష త్వరలోనే నెరవేరుతుందని హామీ ఇచ్చారు.