YSRCP Leaders arrested : దిల్లీ మద్యం కుంభకోణంలో కీలక వ్యక్తులుగా పేర్కొంటూ.. ఇప్పటివరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ అరెస్టు చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలూ వైసీపీ నేతల కుటుంబసభ్యులే. మొదట అరెస్టై పెనక శరత్‌చంద్రారెడ్డి అరబిందో గ్రూప్ డైరెక్టర్లలో ఒకరు. ఆయన వైసీపీలో నం.2గా చలామణీ అవుతూ.. ఆ పార్టీ తరఫున దిల్లీలోనూ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి సొంత అన్న. ఆ కేసులో ఈడీ శనివారం అరెస్టు చేసిన రాఘవ్ మాగుంట.. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న.. మద్యం కుంభకోణం కేసులో శరత్‌చంద్రారెడ్డి, రాఘవరెడ్డి అరెస్టు అవడం.. వైసీపీ అధినాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
సాధారణ ఎన్నికలకు.. ఏడాదే ఉండటం, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కిన తరుణంలో.. వైసీపీ కీలక నేతల కుటుంబసభ్యులు భారీ కుంభకోణం కేసులో అరెస్టవడంతో.. ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా దాడిచేసేందుకు అస్త్రాలు ఇచ్చినట్లయిందని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల్లోనూ.. శరత్ నిందితుడు. హెటిరో, అరబిందోలకు భూ కేటాయింపుల కేసులో సీబీఐ దాఖలు చేసిన మొదటి అభియోగపత్రంలో శరత్‌ను ఎనిమిదో నిందితుడిగా పేర్కొన్నారు.