ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడి పందేల నిర్వహణకు అధికార నేతల 'బరి' తెగింపు ఏర్పాట్లు - వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ

YSRCP Leaders : సంక్రాంతి వేళ అధికార కోడి.. పందేనికి కాలు దువ్వుతోంది. వైసీపీ నేతలు బరి తెగింపులకు సిద్ధమవుతున్నారు. కోడిపందేలకు బరులు మావే ఉండాలి.. మేం చెప్పినవాళ్లకే అనుమతివ్వాలంటూ.. వైసీపీ నాయకులు ఆదేశిస్తే అధికారులూ కిమ్మనడం లేదు. భీమవరంలో కలెక్టరేట్‌కు అతి చేరువలోనే తాడేవు వద్ద 20 ఎకరాల్లో వైసీపీ ఎంపీపీ కోడిపందేలకు బరులు సిద్ధం చేస్తున్నా.. యంత్రాంగం చూస్తుండిపోయిందంటే అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతోందో తెలుస్తోంది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతోపాటు.. బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో కొన్ని చోట్ల అధికార పార్టీ ఎమ్మేల్యేలు, నేతలు, వారి అనుచరులు యథేచ్ఛగా బరులు సిద్ధం చేస్తున్నారు.

Kodi Pandalu
కోడి పందేలు

By

Published : Jan 8, 2023, 7:13 AM IST

Updated : Jan 8, 2023, 11:12 AM IST

Kodi Pandalu : సంక్రాంతి పండుగకు కోడిపందేల బరులు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం పైకి అనుమతులు లేవని చెబుతున్నా అధికార పార్టీ వారే అత్యధికంగా బరులు ఏర్పాటు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వైసీపీ సీనియర్ నేతే స్వయంగా పందేల్లో పాల్గొంటున్నారు. కృష్ణా, పశ్చిమగోదవారి జిల్లాల సరిహద్దులోని లోసరిలోనూ.. అధికార పార్టీ నేతలు బరులు గీస్తున్నారు. వీరవాసరం మండలంలోని కొణితివాడలో పందేల నిర్వహణకు వైసీపీలోని రెండు వర్గాలు పోటీపడి రోడ్డెక్కడం పరిస్థితికి అద్దంపడుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం మండలంలోని పెదఅమిరం, కాళ్ల పరిధిలోని కాళ్లకూరు, సీసలి, జువ్వలపాలెం, ఉండి మండలం యండగండి, మహదేవపట్నం, ఆకివీడు పరిధిలోని దుంపగడప, గణపవరం మండలంలోని అర్ధవరంతోపాటు.. తాడేపల్లిగూడెం, చింతలపూడి, మొగల్తూరు, నరసాపురం, పాలకొల్లు, కలిదిండి, నిడదవోలు, కొవ్వూరులోనూ బరులు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, కాకినాడ గ్రామీణం, కరప, తాళ్లరేవు, రామచంద్రపురం, ఐ.పోలవరం, ముమ్మిడివరం, అల్లవరం, అమలాపురం, రాజోలు, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, అంబాజీపేట, అయినవిల్లి, కాట్రేనికోన మండలాల్లో పలుచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకుల కనుసన్నల్లో పందేలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బరుల పక్కనే పేకాట, గుండాటల నిర్వహణకూ సిద్ధం చేస్తున్నారు. గతేడాది కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో రాష్ట్రస్థాయి బరి నిర్వహించి.. కోట్ల రూపాయల జూదం నిర్వహించారు.

అధికార పక్షమే బరి ఏర్పాటు :ప్రతిపక్షాలవారు, తమకు కప్పం కట్టని పందేల నిర్వాహకులు బరులు ఏర్పాటు చేయకుండా.. అధికార పార్టీ నేతలు పోలీసులతో ముందే కట్టడి చేయిస్తున్నారు. గతంలో ఆకివీడు మండలం దుంపగడప బరిని తెలుగుదేశం నాయకులే నిర్వహించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వారు బరి వేయకుండా.. అప్పటి మంత్రి రంగనాథరాజు తెర వెనుక ఉండి అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈ మూడేళ్లలో కోడిపందేల నిర్వహిస్తున్న వారిపై .. 3 వేల 27 కేసులు నమోదు చేసి.. 6 వేల 455 మందిని అరెస్ట్‌ చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ మూడేళ్లలో 17 వందల 37 కేసులు నమోదు చేసి.. 5 వేల 403 మందిని అరెస్ట్‌ చేశారు. రెండు చోట్లా కలిపి కోటి రూపాయలకు పైగా నగదు, దాదాపు 8 వేల కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ప్రతిపక్షాలవారివి, అధికార పార్టీ నేతలకు కప్పం కట్టని నిర్వాహకులవేనన్న ఆరోపణలున్నాయి.

బహిరంగంగా కోడి పందేల నిర్వహణ కోడిపందేల నిర్వహణకు అనుమతి లేదని చెబుతున్నా పండుగకు ఒక రోజు ముందు ఏర్పాటు చేసుకోండంటూ పోలీసులే అధికార పార్టీ నేతలను సముదాయిస్తున్నారు. సరదా, సంప్రదాయం పేరిట కోడిపందేల ముసుగులో కోట్లాది రూపాయల జూదం నడుస్తున్నా పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే కోడిపందేలు ప్రారంభమయ్యాయి. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ పరిధిలో కోడిపందేలతోపాటు జూదం, మందు-విందు అన్నీ బహిరంగంగానే నిర్వహిస్తున్నారు. అదంతా ఓ వైసీపీ నేత కుటుంబసభ్యుల పర్యవేక్షణలో జరుగుతుండటంతో.. పోలీసులు అటువైపు చూడటం లేదు. అలా చూడకుండా ఉంటామనే షరతుతోనే.. పోలీసు అధికారులు అక్కడ పోస్టింగ్ పొందుతారనే విమర్శలున్నాయి. వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ సొంతూరు నిజాంపట్నంలో.. ఈ నెల 10 నుంచి 16 వరకూ పేకాట శిబిరాలను బహిరంగంగానే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మోర్తాడ ప్రాంతంలో కృష్ణా నది మధ్యలోకి పడవల్లో తీసుకువెళ్లి మరీ జూదం ఆడిస్తున్నారు. నిజాంపట్నం, రేపల్లె మండలంలోని పేచేరు, నగరం, చెరుకుపల్లి శివారులో కోడిపందేలతోపాటు.. పేకాట శిబిరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమూరు నియోజకవర్గ పరిధిలోనూ స్థానిక వైసీపీ ముఖ్య నాయకుడి అనుచరులు కోడిపందేలతోపాటు.. జూదం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భట్టిప్రోలు మండలంలోని పల్లెకోనూ, చుండూరు, వలివేరు మధ్యన పొలాల్లో, కొల్లూరులోని లంక గ్రామాల్లో పందేలకు సిద్ధం చేస్తున్నారు.

సొంత పార్టీ వారైతే కొంత లాభం :సొంత పార్టీవారు, తమ అనుచరులు పందేలు నిర్వహిస్తే వైసీపీ ఎమ్మెల్యేలకు లాభాల్లో వాటా ఉంటుందని సమాచారం. నిర్వాహకులు వేరేవాళ్లయితే ఈ నెల 10 నుంచి 12 వరకు రోజుకు ఒక్కో బరి మీద 20 లక్షలు, 13, 14, 15 తేదీల్లో అయితే రోజుకు 50 లక్షల వరకు కప్పం కట్టేలా రేట్లు ఖరారు చేశారని తెలుస్తోంది. గతేడాది సంక్రాంతికి గుడివాడలో ఏర్పాటు చేసిన క్యాసినో సంచలనం రేపగా, ఈసారీ ఏర్పాటు చేయవచ్చన్న ప్రచారం నడుస్తోంది. నందివాడ, కంకిపాడు, గన్నవరంతోపాటు నున్నలో బరుల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బరుల వద్ద తినుబండారాలు, శీతల పానీయాల దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా వేలాలు నిర్వహిస్తున్నారు.

కోడి పందేల నిర్వహణకు అధికార నేతల 'బరి' తెగింపు ఏర్పాట్లు

ఇవీ చదవండి:

Last Updated : Jan 8, 2023, 11:12 AM IST

ABOUT THE AUTHOR

...view details