MLC Elections Results : సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించిన మండలి ఎన్నికల ఫలితాలు దేనికి సంకేతం..? ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పట్టభద్రులు ఓటు రూపంలో ప్రతింబింబించారా..? మరీ ముఖ్యంగా రాజధాని తరలిస్తున్నాం.. పెట్టుబడులు తీసుకొస్తున్నామంటూ అధికార పార్టీ నేతలు ఊదరగొట్టినా.. ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఏమాత్రం అంగీకరించలేదంటే వారు ఏం కోరుకుంటున్నారు..? ఆరు జిల్లాల పరిధిలో పోలింగ్ జరిగినా ఏ ఒక్కరౌండ్‌లోనూ అధికార పార్టీ అభ్యర్థి మెజార్టీ సాధించలేదంటే.. ప్రభుత్వ పాలనపై అంత వ్యతిరేకత ఉందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
గతంలో ఎన్నికపై వైవీ సుబ్బారెడ్డి : 'ఈ ఎన్నిక ఎంత ప్రతిష్టకరంగా తీసుకున్నామనే దానికి మనం గత వారం, పదిరోజులుగా దీనిపై దృష్టి పెట్టి.. మన పార్టీ మద్దతుతో ఎన్నికలలో నిలబడ్డ అభ్యర్థి గెలుపు ఏ విధంగా ఉండాలి. గత నాలుగు సంవత్సరాల నుంచి మన ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పాలనే మనకి.. ఈ ఎన్నికలలో బలం చేకూరుస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిపక్షాలు మనపై దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దానిని మనం సమర్థవంతంగా తిప్పికొట్టడానికి మనం ఈ ఎన్నికలను వాడుకోవటానికి దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ ఎన్నికలలో ఓటు వేసే ప్రతి ఒక్కరూ పట్టభద్రులు. వారు ప్రభుత్వంపై, ప్రభుత్వంపై అవగాహన కలిగి ఉంటారు. వారిచ్చే తీర్పుతోనైనా ప్రతిపక్షాలకు కనువిప్పు కలుగుతుంది' అని వైసీపీ నేత సుబ్బారెడ్డి పిబ్రవరి 23వ తేదీన ఓ సమావేశంలో అన్నారు.
ఇవి వైసీవీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేవారంతా పట్టభద్రులేనని, వారికి ఖచ్చితంగా రాష్ట్ర పాలనపైనా, రాష్ట్రంలో పరిస్థితులపైనా ఖచ్చితమైన అవగాహన ఉంటుందని.. వారిచ్చే తీర్పు వైసీపీ పాలనకు గీటురాయి అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఒకరకంగా వారి తీర్పు రాష్ట్ర పరిస్థితులను ప్రతిబింబిస్తాయన్న రీతిలో ఆయన వ్యాఖ్యానించారు. మరి వీటిని ప్రామాణికంగా తీసుకుంటే.. ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని స్పష్టమైన తీర్పు ఇచ్చారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.