Tragedy in Vijayawada Patamatalanka: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు అవి. దొరికిన పనిచేసుకుంటూ, వారికి పుట్టిన కుమారులను అల్లారు ముద్దుగా సాకుతున్న ఆ కుటుంబంలో ఓ మామిడికాయల లారీ పెను ప్రమాదాన్ని సృష్టించింది. ఆ కుటుంబానికి తీరని అన్యాయం చేసింది. అప్పటి వరకు అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ.. ఆడుకుంటూ.. లాలపోసుకున్నాడు బాలుడు. ఒళ్లు తుడవడానికి తువ్వాలు తెచ్చేందుకు తల్లి ఇంట్లోకి వెళ్లగా.. ఇంతలోనే లారీ బోల్తా పడి ఆ బాలుడు ఇరుక్కున్నాడు. మామిడి కాయల లోడు కింద ఊపిరాడక.. అమ్మ వచ్చేలోపే.. ఊపిరి ఆగిపోయింది. దీంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుమారుడు మృతి చెందడం తట్టుకోలేకపోయిన ఆ తల్లి గుండె ఒక్కసారిగా విలవిలాడింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి కుమారుడు బలవ్వడంతో ఆ కుటుంబం రోదనలు ఆకాశాన్నంటాయి. మరోవైపు బాలుడు మృతితో విజయవాడ పటమట లంకలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న బంధుమిత్రులు ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టగా.. రంగ ప్రవేశం చేసిన పోలీసులు నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు.
విజయవాడలోని పటమట లంక స్క్రూబ్రిడ్జి ప్రాంతానికి చెందిన శివయ్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇతని భార్య మల్లీశ్వరి. కుమారుడు సంజయ్‌కు మూడేళ్లు. ప్రతిరోజులానే తల్లి ఇంటి ఆరుబయట బాలుడికి స్నానం చేయించింది. తువ్వాలు తీసుకొచ్చేందుకు ఇంట్లోకి వెళ్లింది. మామిడికాయల లోడ్‌తో నూజివీడు నుంచి చిత్తూరు వెళ్తున్న లారీ శుక్రవారం రాత్రి 8 గంటల 50 నిమిషాలకు పైవంతెన నుంచి కింద దిగుతూ అదుపుతప్పి, పటమటలంక వైపు సూబ్రిడ్జి కింద ఉన్న ఇళ్ల ముందు పడింది.
ఈ క్రమంలో అక్కడే ఉన్న బాలుడిపై లారీ పడడంతో లోడ్ కింద చిన్నారి చిక్కుకున్నాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కేబిన్లో ఇరుకున్న డ్రైవర్, క్లీనర్‌ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం క్రేన్ల సహాయంతో లారీని పక్కకు జరిపి చిన్నారిని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడ్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.