Traditional Sweets for Sankranti: నోరూరించే నేతి అరిసెలు.. కరకరలాడే చక్రాలు.. రుచికరమైన కజ్జికాయలు.. నోట్లో వేసుకోవాలనిపించే లడ్డూలు.. ఇవి కదా సంప్రదాయ పిండివంటలంటే.! అందులోనూ సంక్రాంతికి తెలుగువాళ్లు వీటి రుచి చూడకుండా ఉంటారా..? మిఠాయి దుకాణాల్లో ఎన్ని కొత్త పేర్లతో స్వీట్లు కనిపించినా సంక్రాంతికి అరిసెలు ఎక్కడున్నాయా అని వెతికేవారుంటారు.
ఉమ్మడి కుటుంబాల్లో.. అదీ పల్లెల్లో సంక్రాంతికి నేతి అరిసెలు చేయని ఇళ్లంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు చాలా వరకూ మారిపోయాయి. అరిసెల పిండికొట్టే రోకళ్లు, రోళ్లే చాలా ఇళ్లల్లో కనిపించడం లేదు. అరిసెలు చేయడం రానివారు కొందరైతే, వచ్చినా చేసే ఓపిక లేక.. దుకాణాలకు వెళ్లి కొంటున్నవారు మరికొందరు. అలాంటివారి కోసమే.. వ్యాపారులు సంక్రాంతి వంటకాలు ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఆర్డర్లు ఇస్తే.. కోరిన పిండివంటలు ఇంటికే పంపే వ్యాపారాలు పెరిగిపోయాయి. వినియోగదారుల అభిరుచి మేరకు బెల్లం, పంచదార, నెయ్యి, జీడిపప్పు, నువ్వులు వంటివి జోడించడమే కాకుండా.. సుగర్‌లెస్ స్వీట్లు కూడా సిద్ధం చేస్తున్నారు.
"మేము పది సంవత్సరాల నుంచి పిండి వంటలు చేస్తున్నాము. వివిధ రకాల వంటకాలు చేస్తాం - లక్ష్మి, పిండివంటల తయారీదారు".
సంక్రాంతికి సంప్రదాయ వంటకాల ఆర్డర్లు పెరిగాయంటున్నారు తయారీదారులు. అరిసెలు, జంతికలు, సున్నుండలు, తొక్కుడు లడ్డు, అప్పాలు, బూరెలు, కజ్జికాయలు, గవ్వలు, చక్కిలాలు, మురుకులు, చెక్కలు వంటివి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.