Trade Unions Protest Against the Privatization of Visakhapatnam Steel: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినా.. స్టీల్ ప్లాంటును ప్రైవేట్ పరం చేసేందుకు మోదీకి సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే అనేక సార్లు దిల్లీ వెళ్లి.. మోదీని కలిసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఏ ఒక్క సారి కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు ప్రయత్నాలు చేయలేదని అన్నారు. కనీసం చర్యలు తీసుకోవాలని కూడా మోదీని కోరలేదని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన నిరసనలు 700వ రోజుకు చేరిన సందర్భంగా.. విజయవాడలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. రాష్ట్రంలో అనవసరమైన విషయాలపై అధికార పార్టీ దృష్టి పెడుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
"విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. దానికి సొంత గనులు కేటాయించాలని ఈ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఒక్క సారి కూడా ఆ మాట రావడం లేదు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా పైకి నామమాత్రంగా శాసనసభలో తీర్మానం చేశారు తప్ప.. లోపల మాత్రం మోదీతో కలసి ఈ ప్లాంటును అదానీకి అప్పజెప్పాలని చూస్తున్నారు". - ఓబులేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటీయూసీ
"మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అభ్యర్థి ఏమయ్యాడు. డిపాజిట్లు కూడా రాలేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. లేదు.. మేము విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తామంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ప్రభుత్వం రంగ సంస్థలు అమ్మకం అంటే.. భారత దేశం అమ్ముతున్నట్లే". - ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఐటీయూ
ఏలూరులో నిరసనలు: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఏలూరు ఫైర్ స్టేషన్ కూడలిలో నిర్వహించిన ఈ ధర్నాలో సీఐటీయూతో పాటు అనుబంధ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఫ్టీయూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ప్రాణ త్యాగాలు, పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును కార్పొరేట్ శక్తులకు అప్పగించే యత్నాలు మానుకోవాలని సీఐటీయూ నాయకులు నినాదాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన నాయకులు.. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ విధానాలు మార్చుకోవాలని లేని పక్షంలో తమ ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
కర్నూలులో ఆందోళనలు: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని.. విశాఖ ఉక్కు పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం 700 రోజుకు చేరడంతో వారికి సంఘీభావంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే నడపాలని డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపేంత వరకు ఉద్యమాలు చేస్తామని.. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని తెలిపారు.
విశాఖ ఉక్కు కోసం 700వ రోజుకి చేరిన నిరసనలు.. కార్మిక సంఘాల ఆందోళనలు ఇవీ చదవండి: