Vijayawada to Secretariat Road Construction Works : విజయవాడ నుంచి సచివాలయం, హైకోర్టుకు వెళ్లే రహదారి.. విస్తరణకు నోచుకోవడం లేదు. 150 కోట్ల రూపాయలతో ఉండవల్లి కరకట్ట రహదారి విస్తరణ పనులకు 2021 మే నెలలో ముఖ్యమంత్రి జగన్ భూమి పూజ చేశారు. రెండేళ్లు పూర్తయినా విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. ఉండవల్లి కరకట్ట నుంచి వైకుంఠపురం వరకు దాదాపు 15 కిలోమీటర్ల పొడవునా.. రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 10 మీటర్ల వెడల్పుతో రోడ్డు విస్తరణ చేపట్టాలని భావించినా.. పనులు పూర్తి కావడం లేదు.
ఈ రహదారిలో ఒక వాహనం వెళ్తే మరో వాహనం పక్కనుంచి వెళ్లడానికి అవకాశం లేదు. ఈ దారి గుండా విజయవాడకు ప్రయాణాన్ని కొనసాగించాలంటే వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రైతుల నుంచి కొంత భూసేకరణ చేసి.. మట్టి, కంకర వేసి రహదారికి అనుగుణంగా చదును చేశారు. మిగతా పనులు పూర్తి చేయడానికి భూములివ్వడానికి రైతులు అంగీకరించడం లేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. రైతులను ఒప్పించి భూమి సేకరించడంలో.. అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు.
రోడ్డు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. పైగా ఇదే రహదారిలో ముఖ్యమంత్రి, మంత్రులు సహా ఉన్నతాధికారులు, హైకోర్టు న్యాయమూర్తులు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఉండటంతో.. ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. ఆ సమయాల్లో సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురువతున్నాయి. చాలా సేపు వేచి ఉండాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.