ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొల్లపూడిలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. అడ్డంకులు సృష్టించినా వర్ధంతి ఆగదంటున్న టీడీపీ నేతలు

NTR’s death anniversary: గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. NTR వర్ధంతి సేవా కార్యక్రమాలు అడ్డుకున్నందుకు పార్టీ కార్యాలయం బయటే టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు.

gollapudi
gollapudi

By

Published : Jan 18, 2023, 9:15 AM IST

NTR’s death anniversary: ఎన్టీఆర్​ జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఎన్టీఆర్​ వర్ధంతి సేవా కార్యక్రమాలు అడ్డుకున్నందుకు పార్టీ కార్యాలయం బయటే టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. అర్ధరాత్రి దేవినేని ఉమా నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పార్టీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని దేవినేని ఉమ తేల్చి చెప్పారు.

ఇదీ జరిగింది: గొల్లపూడి వన్‌సెంటర్‌ రోడ్డులో ఆలూరి శేషారత్నం పేరుతో స్థలం ఉంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. స్థలాన్ని కుమారులైన హరికృష్ణ చౌదరి (చిన్నా), సుబ్బారావుకు ఆమె 2009లో గిఫ్ట్‌డీడ్‌ చేశారు. కుమారులు తనకు నెలవారీ నిర్వహణకు డబ్బులు ఇవ్వట్లేదని, తన బాగోగులు చూడట్లేదని కొన్నాళ్ల క్రితం ఆమె కలెక్టరును ఆశ్రయించారు. గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేసి స్థలాన్ని తిరిగి తనకు అప్పగించాలని విన్నవించారు.

అయితే ఆ స్థలంలో కొన్నేళ్లుగా టీడీపీ కార్యాలయం ఉంది. ఇంతలో గిఫ్ట్‌ డీడ్‌ను రద్దు చేయాలని ఇబ్రహీంపట్నం సబ్‌-రిజిస్ట్రార్‌కు సూచిస్తూ కలెక్టర్‌ డిల్లీరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విజయవాడ గ్రామీణ మండలం తహసీల్దారు సాయి శ్రీనివాస్‌ నాయక్‌, ఏసీపీ హనుమంతరావు, సీఐ ఉమర్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడంతో టీడీపీ నాయకులు ప్రతిఘటించారు.

భారీ సంఖ్యలో పోలీసులు కార్యాలయం వద్దకు చేరుకుని, అక్కడున్న నాయకులు, కార్యకర్తలను బయటకు పంపించి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం వివాదాస్పదంగా మారింది. ఎన్టీఆర్‌ వర్ధంతికి ఒకరోజు ముందు జరిగిన ఈ ఘటనపై టీడీపీ నాయకులు భగ్గుమన్నారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉత్కంఠత నెలకొంది.

అడ్డంకులు సృష్టించినా వర్ధంతి ఆగదు. గొల్లపూడిలో నేను 14 ఏళ్లుగా ఉంటున్నా. 3 సార్లు ఈ కార్యాలయం నుంచే ఎన్నికల ప్రచారం నిర్వహించా. వైసీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్టీఆర్‌ వర్ధంతిని జరిపి తీరుతాం. రక్తదానం, అన్నదానం చేస్తాం. - దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి

కుటుంబ విషయంలో జోక్యం తగదు.ఇది మా కుటుంబ విషయం. పోలీసులు, తహసీల్దారు జోక్యం తగదు. నా తల్లికి ప్రతి నెలా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయడం కుట్రగానే కనిపిస్తోంది. టీడీపీ కార్యాలయం ప్రారంభాన్ని అడ్డుకోవడం, ఎన్టీఆర్‌ వర్ధంతి జరగకుండా చేయాలనే ఇలా చేస్తున్నారు. - ఆలూరి హరికృష్ణ చౌదరి, టీడీపీ నాయకుడు, గొల్లపూడి


ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details