Hundreds of YSRCP leaders joined in TDP under Nara Lokesh: రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. దేశమంతా మంగళగిరి నియోజకవర్గం వైపు చూసేలా ప్రగతి పథంలో నడిపిస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు భరోసానిచ్చారు. తాను యువగళం పాదయాత్రలో ఉన్నప్పటికీ మనసంతా మంగళగిరిపైనే ఉంటుందని తెలియజేశారు. రెండు రోజులపాటు యువగళం పాదయాత్రకు విరామం ఇచ్చిన యువనేత.. కోర్టు పని మీద గురువారం రోజున సొంత నియోజకవర్గానికి చేరుకున్నారు. దీంతో వందలాది మంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు లోకేశ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో అందరికీ పసుపు కండువాలు కప్పి లోకేశ్ వారిని పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు.
నవంబర్ లేదా డిసెంబరులో ఇచ్ఛాపురం.. యువనేత నారా లోకేశ్ మాట్లాడుతూ.. ''గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో ప్రజల కోసం 23 సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాను. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబరు వరకూ యువగళం పాదయాత్ర ఇచ్ఛాపురానికి చేరుకుంటుంది. యువగళం ద్వారా రాష్ట్రమంతటా చైతన్యం తీసుకొచ్చాక.. మళ్లీ ఈ మంగళగిరికి వస్తాను. ఆ తర్వాత మంగళగిరి ప్రజలతోనే నేను ఉంటాను. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు, పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. గత ఎన్నికల్లో (పోయినసారి) ఓడిపోయింది స్వల్ప తేడాతోనే. ఈసారీ భారీ మెజారిటీతో నన్ను గెలిపించి, ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను'' అని ఆయన అన్నారు.
ఓడిపోయిన 23 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టా.. తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. దేశమంతా మంగళగిరి నియోజకవర్గం వైపు చూసేలా ప్రగతిపథంలో నడిపిస్తానని నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. గడిచిన నాలుగేళ్లలో ఆరోగ్యరథం, పెళ్లికానుక, తోపుడు బండ్లు, జలధార, కుట్టుమిషన్లు, వెల్డింగ్ మిషన్లు, పండగ కానుకలు, చేనేతలు, స్వర్ణకారుల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన ఘనత తనదేనన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఓడిపోయిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా తాను చేసినట్టు సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు చేశారేమో.. కనుక్కోండని ప్రజలకి సూచించారు. వైఎస్సార్సీపీకీ చెందిన వ్యక్తిని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా.. మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా..? అని లోకేశ్ ప్రశ్నించారు. తాను చేసిన సంక్షేమంలో కనీసం 10శాతమైనా చేశాడా..? అని ప్రశ్నించగా.. అక్కడున్న ప్రజలు, మహిళలు లేదని జవాబిచ్చారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధి లేదని, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. దేశమంతా మంగళగిరి వైపు చూసేలా ప్రగతిపథంలో నడిపిస్తా: నారా లోకేశ్ 2024లో నన్ను గెలిపిస్తే.. పేదరికం లేని, ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నా. నేను పాదయాత్రలో ఉన్నా మనసంతా మంగళగిరిపైనే ఉంటుంది. ప్రతి రోజూ మంగళగిరి నియోజకవర్గం గురించి, ప్రజల బాగోగుల గురించి తెలుసుకుంటూనే ఉంటాను. ఎవరైనా కష్టంలో ఉన్నానని, సమస్య ఉందని మెసేజ్ పంపినా స్పందిస్తున్నాను. యువత, మహిళలు, రైతులు, నిరుద్యోగుల కోసం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. 2024లో రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తే.. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి అందరి జీవితాలు బాగుపడతాయి.-నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి