TDP politburo members fired on CM Jagan: దళితుల ఓట్లతో జగన్ సీఎం అయి, మొదట నయవంచన చేసింది దళితులనేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. దళితుల సంక్షేమం కోసం టీడీపీ 27 పథకాలను తీసుకువస్తే, జగన్ సీఎం అవ్వగానే వాటిని రద్దు చేశారని మండిపడ్డారు. నవరత్నాలు ఇస్తే దళితులకు న్యాయం జరుగుతుందా? అని నిలదీశారు. బడ్జెట్లో దళితులకు 7వేల కోట్లు ఇచ్చాము అని చెప్తున్నారు కానీ ఒక రూపాయి నిధులు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళితులు అంతా సీఎం జగన్‌ని కనిపిస్తే నిలదీయాలని డిమాండ్ చేశారు. హైకోర్టులో చివాట్లు పడుతున్నా.. సీఎం జగన్‌కి సిగ్గులేదని ఆక్షేపించారు. కోటిమంది దళితులు, 40 లక్షల మంది గిరిజనుల హక్కులను జగన్ కాలరాశాడని దుయ్యబట్టారు. ఐదుగురికి మంత్రి పదవులు, ముగ్గురికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇస్తే దళితులకు న్యాయం జరిగినట్లేనా అని నిలదీశారు. జగన్ కేబినెట్లో ఉన్న దళిత మంత్రులకు పదవులు ఉన్నాయి, కానీ పది పైసా నిధులు కూడా లేవని ఆక్షేపించారు.