ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ రెడ్డి ప్రసంగమంతా అబద్ధాలే.. వాస్తవాలు ఇవేనంటున్న టీడీపీ - ఏడాది 1200 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రం పాలు

TDP NOTE ON JAGAN ADMINISTRATION : రైతు భరోసా సభలో అర్థసత్యాలు, అబద్ధాలు, విద్వేషాలతో జగన్ రెడ్డి ప్రసంగం ఉందని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. కేంద్రం ఇచ్చిన కిసాన్ సమ్మాన్ నిధిని తానే ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చి దిగజారిన జగన్ రెడ్డి... రైతు భరోసాను రైతు దగాగా మార్చివేశారని దుయ్యబట్టింది. జగన్ రెడ్డి ప్రసంగం అసత్యాలు, వాస్తవాలు పేరిట ఓ ప్రకటనను టీడీపీ విడుదల చేసింది.

టీడీపీ
TDP

By

Published : Feb 28, 2023, 8:46 PM IST

TDP NOTE ON CM JAGAN SPEECH : రైతు భరోసా ద్వారా 27 వేల కోట్లు అందజేశామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం తప్పుబట్టింది. చంద్రబాబు పాలనలో 5 ఏళ్లకు రూ.21 వేల కోట్ల మేర లబ్ది చేకూరితే... గత నాలుగేళ్లలో రాష్ట్ర నిధుల నుండి రైతుభరోసా ద్వారా జగన్ రెడ్డి ఇచ్చింది కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమేనని తెలుగుదేశం వెల్లడించింది. రైతు రుణభారంలో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉందని.. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉందని గుర్తు చేసింది. అసెంబ్లీలో సున్నా వడ్డీ కింద రైతులకు 4 వేల కోట్లు ఇస్తామని ప్రగల్భాలు పలికి.. ఇప్పుడు కేవలం రూ.1,834 కోట్లు ఇచ్చామంటూ భారీ కోత పెట్టిన వాస్తవాన్ని బహిరంగంగా సీఎం అంగీకరించారని టీడీపీ ప్రకటనలో పేర్కొంది.

నాలుగేళ్లలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేశామంటూ ముఖ్యమంత్రి చెప్పింది పూర్తీ అవాస్తమని తెలుగుదేశం విమర్శించింది. ఈ ఏడాది ఏపీలో ఖరీఫ్​లో 80 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తికాగా.. అందులో సేకరించింది కేవలం 33 లక్షల టన్నులు మాత్రమేనని తెలిపింది. తెలంగాణలో కోటి 20 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తికాగా అందులో కోటి టన్నులు ప్రభుత్వం సేకరించిందని గుర్తు చేసింది. జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాల వల్ల ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణా కన్నా ఏపీ బాగా వెనకబడి ఉందని.. కోనసీమలో కూడా పంట విరామం ప్రకటించే స్థితి దాపురించిందని మండిపడింది. ధాన్యం బకాయిలు చెల్లించకపోగా.. దళారులతో కుమ్మక్కై ఎంఎస్​పీ 2,040 వుంటే రైతుకు క్వింటాకు దక్కుతున్నది 1,400 మాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.

నాలుగేళ్లుగా వర్షాలు సమృద్ధిగా పడుతుండటంతో ఎక్కడా కరవు అనే మాటే లేదని సీఎం చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం తప్పుబట్టింది. కర్నూలు జిల్లాలో కరువు వల్ల ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నా.. జగన్ రెడ్డ్డి కరువు లేదని ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నాడని ఎద్దేవా చేసింది. ఈ ఏడాది 1200 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రం పాలయ్యాయన్న టీడీపీ.. అందులో తుంగభద్ర జలాలు 596 టీఎంసీలు సముద్రంపాలై కర్నూలు, అనంతపురం జిల్లాలలోని అనేక గ్రామాల ప్రజలు వలసలపాలయ్యారని పేర్కొంది. చంద్రబాబు ఎందుకు సంక్షేమ పథకాలు పెట్టలేకపోయారంటూ జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం తీవ్రంగా తప్పు బట్టింది.

చంద్రబాబు హయాంలో ఏడాది సరాసరి బడ్జెట్ 1.41 లక్షల కోట్లు ఉంటే.. సంక్షేమానికి మొదటి మూడేళ్లలో 2 లక్షల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేసింది. జగన్ రెడ్డికి ఏడాదికి సరాసరి బడ్జెట్ 2.29 లక్షల కోట్లు. మొదటి మూడేళ్లలో సంక్షేమానికి ఖర్చు చేసింది కేవలం 1.45 లక్షల కోట్లు మాత్రమేనని వివరించింది. గజదొంగల ముఠా నాయకుడు చంద్రబాబు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ధ్వజమెత్తింది. చంద్రబాబు పాలనలో ఒక్క పారిశ్రామికవేత్తగాని, ఒక్క ఐఏఎస్ గాని జైలుకు వెళ్లలేదని తెలిపింది.

జగన్ రెడ్డితో పాటు ఆయన్ని నమ్మిన ఐఏఎస్​లు, పారిశ్రామికవేత్తలు జైళ్ల పాలయ్యారని విమర్శించింది. దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరి కన్నా ధనవంతుడు జగన్ రెడ్డి అని స్పష్టం చేసింది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని సీబీఐ ఛార్జిషీట్​లో పేర్కొనటాన్ని తెలుగుదేశం ప్రస్తావించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క మద్యంలోనే రూ.38 వేల కోట్లు కొట్టేయటంతో పాటు ల్యాండ్, సాండ్, వైన్, మైన్, ఎర్రచందనం, గంజాయి, డ్రగ్స్​లో రూ.3 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించింది.

ఇంగ్లీషు మీడియం వద్దన్న చంద్రబాబుకు ప్రజల బిడ్డలకు మధ్య యుద్ధం జరుగుతోందన్న సీఎం వ్యాఖ్యలపైన తెలుగుదేశం స్పందించింది. చంద్రబాబు పాలనలో విద్యా ప్రమాణాలలో దేశంలో ఏపీ 3వ స్థానంలో ఉంటే జగన్ రెడ్డి దాన్ని 19వ స్థానానికి దిగజార్చారని మండిపడింది. టీడీపీ హయాంలో 7 డీఎస్సీలు జరిపి 1.5 లక్షల ఉపాధ్యాయులను నియమిస్తే... జగన్ రెడ్డి ఒక డీఎస్సీ జరపకుండా ఉపాధ్యాయ నియామకాలు చేయకుండా విద్యాప్రమాణాలు దిగజార్చారని మండిపడింది. చంద్రబాబు పాలనలోనే ఇంగ్లీషు విద్య ప్రారంభమయ్యిందనేది వాస్తవమని స్పష్టం చేసింది. స్కూళ్ల విలీనం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాలనీల్లో ఉన్న పాఠశాలలు పోయి 3.5 లక్షల మంది పేదలు విద్యకు దూరమయ్యారని తెలుగుదేశం ఆక్షేపించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details