ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మా నిధులు మాకివ్వండి.. గ్రామ సర్పంచుల ఆవేదన - సర్పంచ్‌లకు 3 వేలు గౌరవ వేతనం

The situation of village sarpanches in AP: గ్రామాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం ఇచ్చిన ఆర్థికసంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడంపై సర్పంచులు మండిపడుతున్నారు. ఎలాంటి రీడింగ్‌ లేకుండానే విద్యుత్ బిల్లులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. బిల్లులు చెల్లించిన పంచాయతీలకు రశీదులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీస్తున్నారు. వైకాపా మద్దతుతో గెలిచిన గ్రామాల్లోనూ ముఖం చూపించలేకపోతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు నిధులు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం జమ చేసే వరకు పార్టీలకు అతీతంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని సర్పంచ్‌లు హెచ్చరించారు.

Village sarpanchs
గ్రామ సర్పంచులు

By

Published : Nov 19, 2022, 9:44 AM IST

The situation of village sarpanches in AP: గ్రామసర్పంచులుగా ఎన్నికై ఏడాదిన్నర దాటిపోతున్నా.. గ్రామంలో చిన్న పనికూడా చేయలేకపోయామని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నెన్నో హామీలిచ్చి ఓట్లు అడిగామని.. ఇప్పుడు ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఎలాంటి నిధులివ్వకపోగా.. కేంద్రం నుంచి వచ్చిన ఆర్థికసంఘం నిధులను సైతం దారి మళ్లించిందని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ పంచాయతీ ఛాంబర్ ఆధ్వర్యంలో విజయవాడలో రెండురోజుల పాటు రాష్ట్రస్థాయి కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన సర్పంచులు హాజరై.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలు పుట్టినప్పటి నుంచి లేని విద్యుత్ బిల్లులు కొత్తగా వసూలు చేయడంపై మండిపడ్డారు. సర్పంచులతో సంబంధం లేకుండా సచివాలయాల పరిధిలో అభివృద్ధి పనులకు 20 లక్షలు చొప్పున కేటాయించడంపైనా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు, సంక్షేమ పథకాలకు దారి మళ్లించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. లెక్కాపత్రం లేని విద్యుత్తు ఛార్జీల బిల్లులు చెల్లించేది లేదని సర్పంచ్‌లు హెచ్చరించారు. గ్రామాల్లో వాలంటీర్లకు ఉన్న విలువ కూడా తమకు లేకుండా పోయిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు.

వాలంటీర్లకు నెలకు 5 వేలు గౌరవ వేతనం ఇస్తుంటే.. సర్పంచ్‌లకు 3 వేలే ఇస్తున్నారన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులు శంఖారావం పేరుతో ఆందోళనలు మరింత ఉధృతం చేయనున్నట్లు ప్రకటించారు. దిల్లీలో ఆందోళన చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

‘ఆర్థిక సంఘం నిధులతో విద్యుత్తు ఛార్జీలు చెల్లించకపోతే చెక్‌ పవర్‌ రద్దు చేస్తామని అధికారులు బెదిరించడం తగదని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. ప్రభుత్వం నిధులు వెనక్కి ఇవ్వకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతామని సర్పంచులు అంటున్నారు.

రాష్ట్రంలో గ్రామ సర్పంచుల ఆవేదన

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details