రిపబ్లిక్ డే పరేడ్‌కు తెలుగు అమ్మాయికి ఆహ్వానం... చిన్న వయస్సులోనే ఘనత Dr Banavatu Tejaswi: తండ్రి చేస్తోన్న సేవ కార్యక్రమాలను చూసి ప్రేరణ పొందింది ఈ అమ్మాయి. తను అలాగే పేదలకు సాయం చేయాలనే ఆశయంతో డాక్టర్ కావాలని చిన్నప్పుడే నిర్ణయించుకుంది. ఆ దిశగా అడుగులు వేసి మంచి ప్రతిభతో వైద్యురాలు అయ్యింది. తన సేవలతో ఎంతో మంది ప్రాణాలు కాపాడింది ఈ ఎంబీబీఎస్ డాక్టర్.
విజయవాడకు చెందిన ఈ యువ డాక్టర్ పేరు తేజస్వి. ఈ అమ్మాయి తండ్రి వెంకటేశ్వరరావు వాణిజ్య శాఖలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్‌గా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమారైలు. అందులో రెండో కుమారై తేజస్వి. చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉంటూ చదువు, ఆటలు.. రెండింట్లో రాణించి నా బెస్ట్ ఇచ్చాను అంటుంది ఈ యువతి. పేదవారికి సాయం చేయాలనే లక్ష్యంతో యువచైతన్య స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కల్చలర్ కమిటీని తన తండ్రి స్థాపించారు. ఆయన్ని ప్రేరణగా తీసుకునే తాను వైద్య వృత్తిలోకి రావాలనుకున్నాను అని చెబుతుంది తేజస్వి.
విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ అభ్యసించి 8 బంగారు పతకాలు సాధించింది. అనంతరం జోథ్‌పూర్ ఎయిమ్స్‌లో జనరల్ మెడిసిన్ పూర్తి చేసి 3 స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. సొంత ఊరుకి ఏదైన చేయాలని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో సీనియర్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అంటుంది ఈ డాక్టర్.
కరోనా సమయంలో రాజస్థాన్ ప్రభుత్వం జోథ్‌పూర్ ఎయిమ్స్‌ను కోవిడ్ చికిత్సకు ప్రధాన ఆసుపత్రిగా ప్రకటించింది . హై రిస్క్ కోవిడ్ కేసులు అన్నీ అక్కడికే వచ్చేవి . ఆ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కోవిడ్ ఐసియూ వార్డులో విధులు నిర్వహించింది. ఆ విశిష్ట సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రిపబ్లిక్ డే పరేడ్‌కు ఆహ్వానం పలికింది. అది తనకు గౌరవంతో పాటు ఆనందంగా ఉందని చెబుతుంది.
పేదలకు వైద్య సేవ అందించాలనే మంచి ఆలోచనతో... కార్పొరేట్ హాస్పటల్స్‌లో అధిక పారితోషకంతో ఉద్యోగం వచ్చినా కాదనుకుని ప్రభుత్వ వైద్యశాలలో చేరిందని తల్లిదండ్రులు అంటున్నారు. మా సోదరి ప్రతిభవంతురాలు, మా అందరికి ప్రేరణ అంటూ.. ప్రధానమంత్రితో పాటు గ్యాలరీలో కూర్చునే అవకాశం దక్కటం చాలా సంతోషమంటున్నారు కుటుంబ సభ్యులు.
ఈ ఏడాది జనవరి 26 న దిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు దేశవ్యాప్తంగా 50 మంది వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన వాళ్లకు ఆహ్వానం లభిస్తే... ఆ 50 మందిలో తాను ఉండటం సంతోషమని భావిస్తుంది తేజస్వి. ఆ వేడుకల్లో మెరిటోరియస్ అవార్డ్‌ను కూడా అందుకొనుంది. భవిష్యత్‌లో మల్టీ స్పెషాలిటీ కోర్సును పూర్తి చేసి మరింత మెరుగ్గా బాధితులకు వైద్య చికిత్స అందిస్తానని ధీమా వ్యక్తం చేస్తుంది ఈ డాక్టర్.
ఇవీ చదవండి: