Mumbai police conducted searches in Jaggaiyapet: మహారాష్ట్ర పోలీసుల తనిఖీలతో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇటీవలే ముంబయిలో కిడ్నాప్ అయిన బాలుడి కేసును ఛేదించిన పోలీసులు.. మరోసారి సోదాలు చేపట్టడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ముంబయికి చెందిన మరో నలుగురు పిల్లలను విజయవాడకు చెందిన శ్రావణి.. జగ్గయ్యపేటలోని శిల్పకి విక్రయించిందని, ఇప్పుడు ఆ నలుగురు పిల్లలు జగ్గయ్యపేట ప్రాంతంలోనే ఉన్నట్టుగా తమకు సమాచారం అందిందని ముంబయి పోలీసులు తెలిపారు. తనిఖీలు చేపట్టిన అధికారులు.. దేచుపాలెంలో ఇద్దరు పిల్లలు లభ్యమయ్యారని, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.
ముంబయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయికి చెందిన మరో నలుగురు పిల్లలు జగ్గయ్యపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నారని మాకు సమాచారం అందింది. ఆ సమాచారం అందిన వెంటనే ఇక్కడి స్థానిక పోలీసులకు ఫోన్ చేసి తెలుసుకుని, ఈరోజు జగ్గయ్యపేటకు వచ్చాం. ముంబయిలో కిడ్నాప్‌నకు గురైన ఐదుగురు పిల్లలు విజయవాడకు చెందిన శ్రావణి.. జగ్గయ్యపేట శిల్పకి అమ్మడం జరిగింది. ఇప్పటికే ఇద్దరు మగ పిల్లల్ని స్వాధీనం చేసుకున్నాం. జగ్గయ్యపేట బ్రాహ్మణ బజారులో ఒక పిల్లవాడు ఉన్నట్టుగా గుర్తించాం. మరో పిల్లవాడు విస్సన్నపేటలో ఉన్నాడని సమాచారం తెలిసింది. వారికోసం ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి'' అని తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే:ఏడాది క్రితం ముంబయికి చెందిన ఒక బాలుడు కిడ్నాప్ అయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంవత్సరం తర్వాత ఆ బాలుడు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలోని దేచుపాలెం గ్రామంలో దొరికినట్టు తెలిపారు. అదే తరహాలో ముంబయికి చెందిన మరో నలుగురు పిల్లలు జగ్గయ్యపేట ప్రాంతంలో ఉన్నట్టు వారికి సమాచారమందడంతో మరోసారి ముంబయి పోలీసులు జగ్గయ్యపేటకు చేరుకున్నారు.