ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 14, 2022, 5:38 PM IST

ETV Bharat / state

సందర్శకులను మరింతగా ఆకర్షించేలా.. జూ పార్క్​లను తీర్చిదిద్దాలి: పెద్దిరెడ్డి

Peddireddy Ramachandra Reddy: రాష్ట్రంలోని జూపార్కులను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని అటవీశాఖ అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. అటవీశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జూపార్క్‌ల్లో.. జంతువుల సమీకరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి జూపార్క్​లో వైట్ టైగర్ సఫారీల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

Peddireddy Ramachandra Reddy
Peddireddy Ramachandra Reddy

Peddireddy Ramachandra Reddy Review: రాష్ట్రంలోని జూపార్క్​లను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్దం చేయాలని అటవీశాఖ అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. అటవీశాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. సందర్శకులను మరింతగా ఆకర్షించేలా తిరుపతి, విశాఖ జూపార్క్​లను తీర్చిదిద్దాలని కోరారు. దేశంలోని పలు జంతుసందర్శన శాలల్లో అదనంగా ఉన్న జంతువులను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కువ సంఖ్యలో ఉన్న జంతువులను ఇతర జూలకు ఇచ్చి, వారి వద్ద నుంచి కొత్త జంతువులను తెచ్చుకునే విధానం ఉందని, దీనిపై అధికారులు కసరత్తు చేయాలని సూచించారు. జామ్ నగర్​లోని ప్రైవేటు జూలో ఉన్న జంతువులను కూడా ఎక్స్చేంజ్, కొనుగోలు ద్వారా కూడా సమీకరించుకోవచ్చని సూచించారు. దీనిపై వన్యప్రాణి విభాగం అధికారులు డీపీఆర్​లు సిద్దం చేయాలని, నిర్ధిష్ట సమయంలోగా వాటిని అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు.

తిరుపతిలో కపిలతీర్థం నుంచి జూపార్క్ వరకు మోనో ట్రైన్​ను ఏర్పాటు చేయడం ద్వారా జూపార్క్​కు సందర్శకుల సంఖ్య పెరిగేలా చేయవచ్చని అన్నారు. వివిధ పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ నిధుల ద్వారా సహకారాన్ని పొందాలని అన్నారు. తిరుపతి జూపార్క్​లో వైట్ టైగర్ సఫారీపై ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో అటవీశాఖ నర్సరీల ద్వారా మేలుజాతి మొక్కలను రైతులకు అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. తిరుపతి, రాజమహేంద్రవరంలోని రీసెర్చ్ సెంటర్ల ద్వారా అధిక ఫలసాయం, కలపను అందించే మేలుజాతి మొక్కలను అభివృద్ధి చేయాలని అన్నారు. తిరుపతిలోని బయోట్రిమ్ ద్వారా ఎర్రచందనంపై పరిశోధనలు చేసి, మేలుజాతి మొక్కలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.

రైతుల నుంచి ఎర్రచందనంపై డిమాండ్ ఎక్కువగా ఉందని, ప్రైవేటు నర్సరీలు ఎక్కువరేట్లకు మొక్కలను విక్రయిస్తున్నాయని అన్నారు. అటవీశాఖ నర్సరీల ద్వారా అందుబాటు ధరలోనే ఎర్రచందనం మొక్కలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వెదురు, జీడిమామిడి, నేరేడు, ఉసిరి, చింత, యూకలిప్టస్ వంటి మొక్కలను నర్సరీల ద్వారా అందిస్తున్నామని, వీటిల్లో కూడా మరింత మేలైన జాతులను అభివృద్ధి చేయాలని సూచించారు. రాష్ట్రంలో అంతరించి పోతున్న అరుదైన జీవ, జంతుజాలంను పరిరక్షించుకునేందుకు బయో డైవర్సిటీ బోర్డ్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న నగరవనాల్లో అరుదైన మొక్కల పెంపకం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details