Ganja Transportation in state: రాష్ట్రంలో గంజాయి వ్యసనపరుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. పగలూ, రాత్రీ తేడా లేకుండా గంజాయి, మాదకద్రవ్యాలు సేవిస్తూ... ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో గంజాయిబాబులు హల్‌చల్ చేయడం కలకలం రేపింది. గంజాయి మత్తులో తూలుతూ ముగ్గురు వ్యక్తులు పరస్పరం దాడులకు దిగారు. వీరి ప్రవర్తనతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదుతో అప్రమత్తమైన ఆర్టీసీ భద్రత సిబ్బంది... గంజాయి సేవించిన ముగ్గురిని పట్టుకున్నారు. బస్టాండ్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో... ఇటీవల గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరుగుతోందని.. ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివారణ చర్యలు చేపట్టాలని పోలీసులను కోరుతున్నారు.
ఆరు కిలోల లిక్విడ్ గంజాయి పట్టివేత.. కొరియర్ ద్వారా రవాణా జరుగుతున్న ద్రవ రూపంలో ఉన్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవటం కలకలం రేపుతోంది. విశాఖ నుంచి కొరియర్ ద్వారా పార్శిల్ రూపంలో విజయవాడ బాలాజీనగర్‌కు లిక్విడ్ గంజాయి చేరుకుంది. గంజాయి కొరియర్ ద్వారా నగరానికి వస్తుందని పక్కా సమాచారం అందటంతో పోలీసులు పార్శిల్ కొరియర్‌పై నిఘా పెట్టారు. బాలాజీనగర్ డిటీడీసీ కొరియర్ సంస్థ వద్ద మాటువేసి దానిని తీసుకునేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆ పార్శిల్‌ను తెరిచి చూడగా ద్రవ రూపంలో ఉన్న గంజాయిని చూసి పోలీసులు విస్తుపోయారు. ఈ దందాలో కీలక వ్యక్తి ఎవరు? ఎన్ని రోజుల నుంచి ఈ అక్రమ రవాణా జరుగుతోందనే అంశంపై లోతుగా దర్యాప్తు చేపట్టారు.