Kidney Disease Patients problems : ఎన్టీఆర్ జిల్లా ఏ. కొండూరు మండలం 15 తండాల్లోని కిడ్నీవ్యాధిగ్రస్తులు అనుక్షణం నరకం అనుభవిస్తున్నారు. చీమలపాడు పెదతండాకు చెందిన సోమిలి అనే వృద్ధురాలు వయస్సు 65 ఏళ్లు. ఈమె కుమారుడు రాంబాబు 10 నెలల కిందట కిడ్నీ జబ్బుతో మృతి చెందాడు. వాలంటీర్ ఉద్యోగం, ఎకరం భూమి, డయాలసిస్ కాలానికి పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి నేతలు చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు సోమిలి కూడా అదే రోగం బారిన పడ్డారు. ఇదే తండాకు చెందిన 42 ఏళ్ల పిచ్చయ్య కూడా కిడ్నీవ్యాధితో పోరాటం చేస్తున్నారు. భర్త వైద్యం, ఇద్దరు పిల్లల పోషణ కోసం పిచ్చయ్య భార్య కూలి పనులకు వెళ్లాల్సి వస్తోంది.
"నాకు కూడా కిడ్నీల సమస్య వచ్చింది. నన్ను చూసుకునే వాళ్లు లేరు. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్లు కూలీ పనులు చేసుకుని జీవీస్తారు. నా కుమారుడు ఇటివలే కిడ్నీల సమస్యతో మరణించాడు. ప్రభుత్వం ఎకరం భూమి ఇచ్చి ఆదుకుంటానని చెప్పింది. భూమి ఇవ్వలేదు." -సోమిలి, కిడ్నీవ్యాధి బాధితురాలు
"నా భర్త ఐదు సంవత్సరాల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడ్తున్నాడు. తిని తినకుండా మందులు తీసుకువచ్చుకుంటున్నాము. మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు. మాకు పిల్లలు ఇద్దరున్నారు. వాళ్లు చిన్నవాళ్లు. వాళ్లను పోషించుకోవటం, మందులు తీసుకోవటం ఇబ్బందిగా ఉంది. ఒక్కోసారి మందులకు డబ్బులు ఉండటం లేదు." -పిచ్చమ్మ, కిడ్నీవ్యాధి బాధితుడి భార్య