Sankalp Siddhi Mart Multilevel Cheating Case: సంకల్ప్ సిద్ధి మార్ట్ మల్టీలెవల్ చీటింగ్ కేసు తీగ లాగితే డొంకంతా కదిలింది. ఆకర్షణీయమైన ప్రకటనలతో తక్కువ సమయంలోనే 11 వందల కోట్లు దండుకున్న నిర్వాహకులు.. ఇక బోర్డు తిప్పేద్దామని భావించారు. డబ్బుని ఇతర చోట్ల పెట్టుబడులుగా మళ్లించే క్రమంలో పోలీసులకు ఫిర్యాదు అందడంతో అడ్డంగా బుక్కయ్యారు. ఈ మోసానికి సంబంధించి తవ్వేకొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. విజయవాడ పోలీసులు 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడతో పాటు ప్రకాశం, బెంగళూరు, బళ్లారి ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న ప్రత్యేక బృందాలు.. నిర్వాహకులకు చెందిన స్థిర, చరాస్తులను అటాచ్ చేసే పనిలో ఉన్నాయి. సంస్థ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ పెద్దఎత్తున డిపాజిట్లు వసూలు చేశారు. కొందరు పోలీసులు, వారి బంధువులు కూడా సంకల్ప్ సిద్ధిలో పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు తెలుస్తోంది.
సంకల్ప్ సిద్ధి మోసంపై ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన వేణుగోపాల్, కిరణ్‌లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వీరు పేరుకే నిర్వాహకులని, తెరవెనుక ఇద్దరు ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల సన్నిహితులే ఈ సంస్థకు చెందిన ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. విషయం బయటికి పొక్కకుండా ఈ నెల 13న విజయవాడలోని ఓ హోటల్‌లో కీలక వ్యక్తులతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. సంకల్ప్ సిద్ధిలో ఎక్కువ మంది గన్నవరానికి చెందిన డిపాజిట్ దారులు ఉన్నారని.. డబ్బు రెట్టింపు అవుతుందన్న ఆశతో విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన వ్యాపారులు కూడా పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు.