HC Adjourned Jagan Kodi Kathi Case Petition: కోడి కత్తి కేసులో లోతైన దర్యాప్తు చేయాలని గతంలో సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను 6వారాలకు వాయిదా వేసింది. ప్రస్తుతం విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో జరుగుతున్న కోడికత్తి కేసు విచారణపై 8వారాలపాటు స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
కాగా.. విశాఖ విమానాశ్రయంలో తనపై కోడికత్తితో దాడి ఘటన కేసులో.. లోతైన దర్యాప్తు కోసం చేసిన అభ్యర్థనను ఎన్‌ఐఏ కోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. కోడికత్తితో తనపై జరిగిన దాడిలో కుట్ర కోణం ఉందని, దీనిపై లోతైన దర్యాప్తు జరపాలంటూ విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో (సాక్షుల విచారణకు షెడ్యూల్ ప్రకటించి, వాంగ్మూలాల నమోదు దశలో) జగన్ పిటిషన్ వేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఎన్‌ఐఏ అభియోగపత్రం దాఖలు చేసిందని పేర్కొన్నారు.
నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు నేర చరిత్ర ఉన్నా ఆ విషయాన్ని పట్టించుకోకుండా క్యాంటిన్ నిర్వాహకుడు విధుల్లోకి తీసుకున్నారని అన్నారు. కుట్ర కోణం తేల్చేందుకు మరింత లోతైన విచారణ జరిపించాలని కోరారు. ఎన్‌ఐఏ కోర్టు జులై 25వ తేదీన ఈ పిటిషన్‌ను కొట్టివేయడంతో జగన్ మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై ఈ నెల 13న విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ దాఖలు చేసిన పిటషన్‌పై నేడు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను మరో 6వారాలకు వాయిదా వేసింది.