Govt Hospital Diet Contract: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి డైట్ కాంట్రాక్టుకు ప్రస్తుతం గట్టి పోటీ ఏర్పడింది. ఏడుగురు గుత్తేదారులు ఈ డైట్ టెండర్లలో పాల్గొనగా వారిలో నిబంధనల ప్రకారం ఏ అర్హతలూ లేవంటూ ఇద్దరు గుత్తేదారులను పక్కకు తప్పించారు. మిగిలిన ఐదుగురు గుత్తేదారుల్లో ముగ్గురు అధికార పార్టీ నేతల అండదండలతో టెండర్ దక్కించుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. గత కొన్నేళ్లుగా చక్రం తిప్పుతున్న గుత్తేదారునే మళ్లీ కాంట్రాక్టు దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పది రోజుల కిందట టెండర్ల సీల్డ్ కవర్లు తెరిచిన సమయంలో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి చెందిన ఇద్దరు కీలక అధికారులు సైతం అతని వైపే మొగ్గుచూపారు. దీంతో పాటు పక్క జిల్లాకు చెందిన ఓ ఎంపీ అండదండలు ఇతనికి ఉన్నాయి.
వైఎస్సార్సీపీ కీలక నేత ఆశీస్సులు:తాజాగా రాష్ట్రానికి చెందిన ఓ కీలక అధికారితోనూ జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మరో గుత్తేదారుకు రాష్ట్రంలోనే ఓ కీలకమంత్రి అండదండలున్నాయి. మరో గుత్తేదారుకు రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కీలక నేత ఆశీస్సులున్నాయి. ప్రస్తుతం ఈ ముగ్గురి కోసం పెద్దస్థాయిలో లాబీయింగ్ జరుగుతోంది. తాము చెప్పిన వారికే ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.
గుత్తేదారుల అర్హతలు:డైట్ కాంట్రాక్టు నిబంధనల ప్రకారం చూస్తే గతంలో గుత్తేదారులు పనిచేసిన ఆస్పత్రుల్లో ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు. ఆసుపత్రుల ద్వారా వచ్చే ఆదాయానికి ప్రతి రూపాయికి జీఎస్‌టీ, ఐటీ సహా అన్నీ చెల్లించాలి. అక్రమాలకు పాల్పడకుండా కనీసం ఐదేళ్లు ఆసుపత్రుల్లో డైట్ కాంట్రాక్టును నిర్వహించిన అనుభవం ఉండాలి. ఎక్కువ ఏళ్ల అనుభవం ఉన్నవాటికి ఏడాదికి ఒక మార్కు చొప్పున వేయాలి. వీటన్నింటినీ అధికారులు పక్కాగా చూడాలి.