Farmers Problems: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ మాటలు, చేతలకు మధ్య చాలా తేడా ఉంది. ధాన్యం కొనుగోళ్ల తీరు చూస్తే.. ప్రభుత్వం చెప్పే మాటల్లో వడ్లగింజంత వాస్తవం కూడా లేని పరిస్థితి. ప్రభుత్వం చెప్తోందే నిజమైతే.. కల్లాల్లో ధాన్యం రాశులు ఇలా పోగుపడేవా? రైతులు మండుటెండల్లో ఇలా అవస్థలు పడేవారా? ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో రబీ సీజన్‌లో వరిసాగు చేశారు. అందులో కొత్తూరు తాడేపల్లికి చెందిన ఈ రైతులూ.. ఉన్నారు.
20 రోజులు దాటినా ధాన్యం.. కల్లం దాటలేదు. రైతులు కళ్లలో ఒత్తులు వేసుకుని రైతు భరోసా కేంద్రాలవైపు చూస్తున్నారు. ప్రస్తుతం కొత్తూరు తాడేపల్లి రైతుల వద్ద ఉన్న ధాన్యం తేమ శాతం 14 మాత్రమే ఉంది. ప్రమాణాల ప్రకారం 17శాతం వరకూ అనుమతిస్తారు. కానీ ఆర్బీకే సిబ్బంది.. రేపుమాపంటూ కాలంగడుపుతున్నారు. ధాన్యం తరలించడానికి గోనెసంచులు రావాలని ఒకసారి, లారీలు రావడం లేదని మరోసారి.. సాకులు చెప్తున్నారని.. రైతులు వాపోతున్నారు.
ఈ ప్రహసనమంతా పూర్తై ధాన్యం రైస్ మిల్లలకు చేరితే.. అక్కడ మిల్లర్లు కొర్రీలు వేస్తున్నారు. ధాన్యం నూకగా మారుతోందంటూ బస్తాకు 5కేజీల ధాన్యాన్నితరుగురూపంలో అదనంగా తీసేస్తున్నారు. మిల్లర్లు బేరాలు ఆడడం తప్ప.. మద్దతు ధరకే కొనడంలేదు.ఇక ఈ సీజన్‌లో ధాన్యం కొనకపోవడమేకాదు.. గత సీజన్‌లో కొన్న ధాన్యం డబ్బూ ఇంతవరకూ చెల్లించలేదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.