No Salaries for AP Govt Employees: ఆంధ్రప్రదేశ్‌లో ఆయా శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నవారికి ప్రతినెల సరైన సమయానికి జీతాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. ఈ నెల జీతం ఎప్పుడొస్తుందో తెలియక అయోమయంలో ఉన్నారు. ప్రతి నెల 1వ తేదీన రావాల్సిన జీతాలు 10వ తేదీ దాటినా కూడా ఇప్పటికీ అందక అప్పులు చేస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు కనీసం స్పందించకపోవడంతో ఉద్యోగులు సతమతమవుతున్నారు.
ఏప్రిల్ 10 దాటినా ఖాతాలు ఖాళీ..ఏప్రిల్నెల ప్రారంభమై రెండు వారాలు గడిచిపోతున్నా.. ఇప్పటికీ రాష్ట్రంలోని కొన్ని శాఖల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదు. కేంద్ర ప్రాయోజిత పథకాలతో అనుసంధానమై ఉన్న నాలుగైదు శాఖల ఉద్యోగులకు ఇప్పటికీ వేతనాలు జమకాని పరిస్థితి నెలకొంది. వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, పురపాలక, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు చెందిన ఉద్యోగులకు వేతనాలు రాని దుస్థితి ఏర్పడింది. అంతేకాదు.. ఆయా శాఖల ఉద్యోగులకు చెందిన వేతన బిల్లులను సీఎఫ్ఎంఎస్ ద్వారా అప్‌లోడ్ చేసేందుకు కూడా వెసులుబాటు కల్పించలేదు.
25వేల మంది ఎదురుచూపు...ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న 25వేల మంది ఉద్యోగులు ఈ నెల వేతనాల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, పురపాలక పట్టణాభివృద్ధి, వ్యవసాయం, గిరిజన , వెనుకబడిన, సాంఘిక సంక్షేమ శాఖల ఉద్యోగులకు ఇప్పటికీ వేతనాలు ఇంకా జమ కాలేదు. దీంతో ఆ శాఖల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆయా విభాగాలు కేంద్ర ప్రాయోజిత పథకాలకు అనుబంధంగా ఉండటంతో సీఎఫ్ఎంఎస్‌కు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాకుండా కొన్ని హెడ్‌లను ఆర్ధికశాఖ బ్లాక్ చేసి పెట్టడంతో ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో పడ్డారు.